Atchannaidu: బీసీలుగా పుట్టడమే నేను, కొల్లు రవీంద్ర చేసిన తప్పా?: అచ్చెన్నాయుడు

atchannaidu slams jagan
  •  అందుకే కేసులు పెడుతున్నారా?
  • సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడితేనే టీవీల్లో లైవ్ వస్తోంది
  • టీడీపీ నేతలు మాట్లాడుతోన్న సమయంలో లైవ్ రానివ్వట్లేదు
  • మీడియా సంస్థలు అన్నింటికీ సమాన అవకాశాలు కల్పించాలి
వైసీపీ సర్కారుపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.  అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'బీసీలుగా పుట్టడమే నేను, కొల్లు రవీంద్ర చేసిన తప్పా?' అని ఆయన నిలదీశారు. అందుకే తమ మీద కేసులు పెడుతున్నారా? అని నిలదీశారు. అసెంబ్లీలో జరుగుతున్న ఘటనలను ప్రజలు చూడకుండా ఉండడానికి అసెంబ్లీ సమావేశాలు ప్రసారం చేయడానికి కొన్ని మీడియా సంస్థలకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు.

సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడితేనే లైవ్ వస్తోందని, టీడీపీ నేతలు మాట్లాడుతోన్న సమయంలో లైవ్ ప్రసారం కాకుండా ఆపుతున్నారని విమర్శించారు.  మీడియా సంస్థలు అన్నింటికీ సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. అలాగే, సలాం కుటుంబం ఆత్మహత్య, డాక్టర్ సుధాకర్ సహా దళితులపై దాడులపైన వాయిదా తీర్మానాన్ని అనుమతించి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.

గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన వర్గాలపైనే ప్రస్తుతం రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై జరిగిన దాడులకు నిరసనగా నేడు వాయిదా తీర్మానం ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే వాయిదా తీర్మానాన్ని అనుమతించి చర్చించాలని డిమాండ్ చేశారు.
Atchannaidu
Telugudesam
YSRCP

More Telugu News