Farmers protest: రుణపడి ఉండాల్సింది పోయి, లాఠీలతో కొట్టి హింసిస్తారా?: కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

  • రైతులకు పెరుగుతున్న మద్దతు
  • అహంకార పీఠం నుంచి దిగి రావాలన్న రాహుల్
  • రైతులేమైనా పాకిస్థాన్ నుంచి వచ్చారా? అని ప్రశ్నించిన అన్నా హజారే
Congerss leader Rahul Gandhi fires on center

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. అన్నదాతకు ప్రతి ఒక్కరు రుణ పడి ఉండాలని, అది పోయి వారిని లాఠీలతో కొట్టించడం, వాటర్ క్యానన్లు ఉపయోగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తన అహాన్ని విడిచిపెట్టి రైతులకు వారి హక్కులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు న్యాయం కోసం రోడ్డెక్కారని, వారి కష్టానికి మనమంతా రుణపడి ఉన్నామని రాహుల్ ట్వీట్ చేశారు. లాఠీలు, బాష్పవాయువును ప్రయోగించి అవమానించడం ద్వారా వారి రుణాన్ని మనం తీర్చుకోగలమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి అహంకార పీఠాన్ని దిగొచ్చి వారి హక్కులను కాపాడాలని రాహుల్ డిమాండ్ చేశారు.

మరోవైపు, రైతుల ఆందోళనకు మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నికలప్పుడు వారి వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతారని, ఇప్పుడు వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పాకిస్థాన్ నుంచి వచ్చారని వాటర్ క్యానన్లు ప్రయోగించారా? అని ప్రశ్నించారు. దేశానికి అన్నదాతలే ప్రాణాధారమని, వారికి అండగా నిలవాల్సిన సమయం ఇదేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.

తప్పుడు హామీలతో రైతుల భూములను ఆక్రమించుకోవాలన్నదే చట్టం చేసిన వారి ఉద్దేశమని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. కనీస మద్దతు ధర కొనసాగుతుందని చెబుతున్న ప్రధాని, వ్యవసాయమంత్రి ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే తప్పేంటని జన్‌నాయక్ జనతాపార్టీ ఎంపీ అజయ్ సింగ్ చౌతాలా ప్రశ్నించారు.

More Telugu News