NIver: తీవ్ర తుపానుగా మారిన నివర్... తమిళనాడులో అతి భారీ వర్షాలు

Niver intensified into very severe cyclone
  • బంగాళాఖాతంలో మరింత బలపడిన నివర్
  • గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పయనం
  • ఈ సాయంత్రం తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 310 కిమీ దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 320 కిమీ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గత 6 గంటలుగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోంది.

నివర్ ప్రభావంతో తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర విభాగాలకు మినహా తమిళనాడులో నేడు సెలవు ప్రకటించారు. 7 జిల్లాల్లో ప్రజా రవాణా నిలిపివేశారు. కాగా, ఈ అతి తీవ్ర తుపాను కారైక్కాల్, మామల్లపురం (మహాబలిపురం) మధ్య తీరం దాటుతుందని, తీరం దాటే సమయంలో కడలూరు, విల్లుపురం, కల్లకురిచ్చి జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలోనూ మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 145 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది.

ఇక నివర్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనే కాకుండా తెలంగాణలోనూ భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి 27వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించారు. కాగా, నెల్లూరు జిల్లాకు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
NIver
Cyclone
Tamilnadu
Andhra Pradesh
Telangana
Bay Of Bengal

More Telugu News