Ahmed Patel: కాంగ్రెస్ దిగ్గజం అహ్మద్ పటేల్ కన్నుమూత

Congress party senior leader Ahmed Patel dies of corona
  • ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన పటేల్
  • కాంగ్రెస్ వర్గాల్లో విషాదం
  • అవయవాల వైఫల్యంతో మరణించినట్టు కుటుంబ సభ్యుల వెల్లడి
కరోనా మహమ్మారి కారణంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. నెల రోజుల కిందట కరోనా బారినపడిన అహ్మద్ పటేల్ కోలుకోలేకపోయారు. గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 71 సంవత్సరాలు.

అహ్మద్ పటేల్ మృతి విషయాన్ని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా ప్రభావంతో అవయవాలు బాగా దెబ్బతిని, మరణానికి దారితీసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనకు ఈ నెల 15 నుంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తమ సీనియర్ నేత మృతితో కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది.

అహ్మద్ పటేల్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ కోశాధికారిగా ఉన్నారు. అహ్మద్ పటేల్ ను రాజకీయ దిగ్గజం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు మూడు పర్యాయాలు లోక్ సభకు, ఐదుసార్లు రాజ్యసభకు వెళ్లారు. 1976లో గుజరాత్ లోని బరూచ్ లో జరిగిన స్థానిక ఎన్నికల ద్వారా ఆయన రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. అక్కడ్నించి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ లో తన విశిష్టత చాటుకున్నారు.

1985లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పటేల్ పార్లమెంటరీ కార్యదర్శిగా వ్యవహరించారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం నియమితమైన నర్మదా మేనేజ్ మెంట్ అథారిటీ ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు.
Ahmed Patel
Demise
Corona Virus
Positive
Gujarath
Congress

More Telugu News