Nara Lokesh: తాతగారి ఆ మానవతా గుణమే తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్తలోనూ నిలిచి వుంది: నారా లోకేశ్

  • 1977 నవంబర్ 19 అర్ధరాత్రి ప్రళయం
  • 83 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి
  • 20 వేల మంది చనిపోయారని అంచనా
  • జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలను సేకరించారు ఎన్టీఆర్
nara lokesh about diviseema tragedy

దివిసీమ ఉప్పెనకు నేటితో 43 ఏళ్లు అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్లు చేశారు. అప్పట్లో ప్రజలను ఆదుకునేందుకు ఎన్టీ రామారావు చేసిన కృషిని గురించి ఆయన వివరించి చెప్పారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళదామని లోకేశ్ పిలుపునిచ్చారు.  

‘దివిసీమ ఉప్పెనకు 43 ఏళ్లు. 1977 నవంబర్ 19 అర్ధరాత్రి సంభవించిన ఆ ప్రళయానికి 83 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయని, దాదాపు 20 వేల మంది చనిపోయారని అంచనా. ఇప్పటికీ ప్రతి ఏటా ఈ రోజున ఆ ప్రాంత ప్రజలు సంస్మరణ కార్యక్రమాలు చేసుకుంటారంటే అదెంత ఘోర విపత్తో తెలుస్తుంది’ అని తెలిపారు.
 
‘ఆ రోజుల్లో సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ తన సామాజిక బాధ్యతను విస్మరించకుండా.. సినిమా రంగాన్ని కూడదీసుకుని జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలను సేకరించారు ఎన్టీఆర్. విడిగా కూడా వ్యక్తిగతంగా ఎన్నో సహాయ కార్యక్రమాలలో పాల్గొని విరాళాలు అందించారు’ అని లోకేశ్ చెప్పారు.

‘రామకృష్ణ మిషన్, బేలూరు మఠం 11 గ్రామాల్లో 1,100 ఇళ్లను కట్టిస్తుంటే వారికి పెద్ద ఎత్తున విరాళాలిచ్చి అన్ని విధాలా సహకరించారు ఎన్టీఆర్. తాతగారి ఆ మానవతా గుణమే తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి స్ఫూర్తిగా ఈనాటికీ నిలిచి ఉంది. ఆ స్ఫూర్తిని ఎప్పటికీ కాపాడుకుందాం’ అని లోకేశ్ పిలుపునిచ్చారు.

More Telugu News