ఏడేళ్ల బాలికను దారుణంగా చంపేసి.. క్షుద్ర పూజల కోసం కాలేయాన్ని తీసుకెళ్లిన నిందితులు!

17-11-2020 Tue 10:47
  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘటన  
  • క్షుద్రపూజలకు కాలేయాన్ని తీసుకురమ్మన్న దంపతులు
  • ఇద్దరు వ్యక్తులకు రూ.1,000 ఇచ్చిన వైనం
  • ఇతర శరీర భాగాలూ తీసుకెళ్లి ఇచ్చిన నిందితులు?
Girl 7 Killed In UPs Kanpur

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికను దారుణంగా చంపేసి ఆమె కాలేయాన్ని తీసుకెళ్లారు ఇద్దరు నిందితులు. ఆమెపై అత్యాచారం చేయడానికి కూడా నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికపై ఈ దారుణానికి పాల్పడడానికి మూఢనమ్మకాలే కారణమని పోలీసులు చెప్పారు.

పిల్లలు లేని ఓ దంపతులు ఇద్దరు వ్యక్తులకు రూ.1,000 ఇచ్చి క్షుద్ర పూజల కోసం బాలిక కాలేయాన్ని తీసుకురమ్మని  చెప్పారు. దీంతో ఇటీవల ఆ ఇద్దరు నిందితులు బాలికను అపహరించారు. అనంతరం ఆమెను చంపేసి కాలేయాన్ని తీసుకెళ్లి పిల్లలు లేని ఆ దంపతులకు ఇచ్చారు.

బాలికను చంపిన ఇద్దరు నిందితులు, కాలేయం తీసుకురమ్మని చెప్పిన దంపతులు ఆ బాలిక గ్రామానికి చెందిన వ్యక్తులే. బాలిక శరీరంలోంచి ఇద్దరు నిందితులు కాలేయాన్ని మాత్రమే కాకుండా ఇతర అవయవాలను కూడా తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బాలిక శరీరంలోంచి ఆ అవయవాలను తీసుకున్న తర్వాత కాన్పూర్ లోని ఓ గ్రామంలో ఆమె మృతదేహాన్ని వదిలేసి ఆ ఇద్దరు పారిపోయారు. ఆ బాలిక మృతదేహం లభ్యమయ్యాక, ఆమె ఇంటి పక్కనే ఉండే ఆంకుల్, బీరాన్ లపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా తామే ఈ ఘాతుకానికి కారకులమని వారు ఒప్పుకున్నారు.

బాలిక కాలేయాన్ని క్షుద్రపూజల కోసం తీసుకురమ్మని పరశురామ్ అనే వ్యక్తి తమకు డబ్బు ఇచ్చాడని వారిద్దరు చెప్పారు. దీంతో ఆమెను చంపిన ఆ ఇద్దరు నిందితులతో పాటు పరశురామ్, అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ జరిపి, అన్ని విషయాలను రాబట్టడానికి పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

పరశురామ్‌కు 1999లో పెళ్లి జరిగింది. అయితే, ఆయనకు ఇప్పటి వరకు పిల్లలు లేరు. దీంతో క్షుద్రపూజలు చేస్తే పిల్లలు పుడతారని అతడు భావించాడని ఆంకుల్, బీరాన్ తమకు చెప్పారని పోలీసులు వివరించారు. కాగా, ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని, కేసు విచారణను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో జరిపేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.