sabarimala: కొవిడ్ నుంచి కోలుకున్న వారు అయ్యప్ప దర్శనానికి రావొద్దు: కేరళ సర్కారు విజ్ఞప్తి

  • ఈ నెల 16 నుంచి శబరిమల మండల పూజ సీజన్ ప్రారంభం
  • కొవిడ్ నుంచి కోలుకున్నా మూడు వారాలపాటు వైరస్ ప్రభావం
  • దర్శనానికి 24 గంటల ముందు కొవిడ్ నెగటివ్ రిపోర్టు తప్పనిసరి
Sabarimala Temple To Reopen On November 16th

ఈ నెల 16 నుంచి శబరిమల మండల పూజ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేరళ సర్కారు కీలక ప్రకటన చేసింది. కరోనా బారినపడి కోలుకున్న వారు ఇప్పుడప్పుడే అయ్యప్ప దర్శనానికి రావొద్దని కోరింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.

 కొవిడ్ నుంచి బాధితులు కోలుకున్నప్పటికీ వారి శరీరంలో మూడు వారాలపాటు వైరస్ ప్రభావం ఉంటుందని, కాబట్టి ఇటువంటి వారు కొండను ఎక్కేటప్పుడు శ్వాస అందక ఇబ్బందులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. శారీరక వ్యాయామాలు చేస్తూ, శ్వాసకోశ సమస్యలు లేవని నిర్ధారించుకున్న వారే కొండకు రావాలని కోరింది.

వచ్చే నెల చివరి నుంచి మకరవిలక్కు దర్శనాలకు శబరిమల దేవస్థానం అనుమతించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తులు తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరింది.

అలాగే, స్వామి వారి దర్శనానికి 24 గంటల ముందు కరోనా నెగటివ్ రిపోర్టు తప్పనిసరని పేర్కొంది. కాగా, శబరిపీఠం నుంచి నీలిమల, శరణ్‌గుత్తి వరకు ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో ఆక్సిజన్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. అయినప్పటికీ ఆక్సిజన్ అందక ప్రతి ఏడాది సగటున 25 మంది వరకు గుండెపోటుతో చనిపోతున్నారు.

More Telugu News