ఐపీఎల్ క్వాలిఫయర్-2: పోరాడినా సరిపోలేదు... ఈ సీజన్ లో సన్ రైజర్స్ కథ ముగిసింది!

08-11-2020 Sun 23:31
  • 17 పరుగుల తేడాతో ఓడిన హైదరాబాద్
  • క్వాలిఫయర్-2లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్
  • నవంబరు 10న ఐపీఎల్ ఫైనల్లో ముంబయితో అమీతుమీ
Sunrisers lost to Delhi Capitals in IPL second qualifier

యూఏఈ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ లో ప్లేఆఫ్ దశ చేరిన సన్ రైజర్స్ కీలకమైన క్వాలిఫయర్-2లో పరాజయం పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో అబుదాబిలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ లో నెగ్గిన ఢిల్లీ జట్టు ఐపీఎల్ ఫైనల్స్ లో ప్రవేశించింది.

సన్ రైజర్స్ లక్ష్యఛేదనలో కేన్ విలియమ్సన్ (67), అబ్దుల్ సమద్ (33) పోరాడినా ఫలితం దక్కలేదు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ విసిరిన కగిసో రబాడా ఆ ఓవర్లో 3 వికెట్లు తీయడంతో సన్ రైజర్స్ పరాజయం ముంగిట నిలిచింది. అంతకుముందు సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ ధాటిగా ఆడుతుండడంతో మ్యాచ్ పై ఆశలు కలిగాయి. సమద్ సైతం బ్యాట్ ఝుళిపించి స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. కానీ రబాడా సరైన ప్రదేశాల్లో బంతులు సంధిస్తూ బ్యాట్స్ మెన్ ను బుట్టలో వేశాడు. చివరి ఓవర్లో 22 పరుగులు సాధించాల్సి రాగా, హైదరాబాద్ ఆటగాళ్లు 4 పరుగులే సాధించడంతో మ్యాచ్ ఢిల్లీ వశమైంది.

ఢిల్లీ జట్టులో బ్యాటింగ్ లోనూ రాణించిన ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ బంతితోనూ విజృంభించాడు. స్టొయినిస్ 3 కీలక వికెట్లు తీసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రబాడా మొత్తమ్మీద నాలుగు వికెట్లు తీసి సన్ రైజర్స్ కు కళ్లెం వేశాడు. అక్షర్ పటేల్ కు ఓ వికెట్ దక్కింది.

అంతకుముందు, కెప్టెన్ డేవిడ్ వార్నర్ (2) విఫలం కావడం సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ఆరంభంపై ప్రభావం చూపింది. హోల్డర్ (11) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు.

ఇక, ఈ మ్యాచ్ లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్... ముంబయి ఇండియన్స్ తో ఐపీఎల్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నవంబరు 10న దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.