Joe Biden: ముంబయిలో ఐదుగురు బైడెన్లు.... భారత్ లో తన పూర్వీకులపై జో బైడెన్ ఆసక్తి!

Joe Biden earlier said about his ancestors who lives in Mumbai
  • తన పూర్వీకులు ముంబయిలో ఉన్నట్టు గతంలో చెప్పిన బైడెన్
  • చాలాకాలం కిందట ముంబయి నుంచి లేఖ వచ్చిందని వెల్లడి
  • ఆ లేఖను నిర్లక్ష్యం చేశానని బైడెన్ విచారం
ఇప్పుడు యావత్ ప్రపంచం అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ కు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తి చూపుతోంది. భారత్ కూడా బైడెన్ పై అమితాసక్తి ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ అంశం తెరపైకి వచ్చింది. గతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ముంబయిలో తమ పూర్వీకులు ఉండేవారని బైడెన్ తెలిపారు. 2015 నాటికి కూడా ముంబయిలో ఐదుగురు బైడెన్ వంశీయులు ఉన్నట్టు తెలిసిందని కొన్నేళ్ల కిందట జరిగిన మరో కార్యక్రమంలోనూ వెల్లడించారు.

1700 సంవత్సరంలో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఈస్టిండియా కంపెనీ భారత్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో తన ముత్తాత తాతకు ముత్తాత భారత్ వచ్చినట్టు తనకు తెలిసిందని బైడెన్ అప్పట్లో చెప్పారు. కాగా, తాను సెనేటర్ అయిన తర్వాత ముంబయి నుంచి బైడెన్ అనే ఇంటిపేరుతో ఓ లేఖ వచ్చిందని, ఆ లేఖను చూసి ఎంతో సంతోషించానని జో  బైడెన్ తెలిపారు. అప్పుడు తన వయసు 29 ఏళ్లు అని, కానీ ఆ సమయంలో వచ్చిన లేఖను అనుసరించి భారత్ వచ్చి తన పూర్వీకుల గురించి ఎందుకు తెలుసుకోలేకపోయానా అని ఇప్పటికీ చింతిస్తుంటానని బైడెన్ విచారం వ్యక్తం చేశారు.

అయితే, ఇప్పుడాయన ముందు మంచి తరుణం నిలిచింది. బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యారు కాబట్టి, తన పూర్వీకుల ఆచూకీ గురించి తెలుసుకోవడం ఎంతో సులభం కానుంది. ఆ దిశగా ప్రయత్నిస్తారో లేదో చూడాలి!
Joe Biden
Ancestors
Mumbai
USA

More Telugu News