మీ కూతురిపై అత్యాచారం చేస్తానన్నది నేనే: విజయ్ సేతుపతిని క్షమించమని అడిగిన నెటిజన్

27-10-2020 Tue 19:54
  • కరోనా వల్ల నా ఉద్యోగం పోయింది
  • చికాకులో ఉండటం వల్ల అలా కామెంట్ చేశాను
  • గతంలో నేను ఎప్పుడూ ఇలా చేయలేదు
Netizen who made bad comments on Vijay Sethupathis daughter asked for excuse him

క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రను పోషిస్తున్న విజయ్ సేతుపతిపై ఎందరో తమిళులు మండిపడ్డారు. ఓ నెటిజన్  మానవత్వాన్ని మరిచి విజయ్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ చిత్రం నుంచి తప్పుకోకపోతే నీ కూతురిపై అత్యాచారం చేస్తానని హెచ్చరించాడు. ఈ బెదిరింపు కలకలం రేపింది. ఈ వార్నింగ్ ను అందరూ ముక్తకంఠంతో ఖండించారు. ఈ క్రమంలో విజయ్ కు వార్నింగ్ ఇచ్చిన సదరు నెటిజన్ క్షమాపణ చెప్పాడు.

విజయ్ సర్ గురించి, ఆయన కూతురు గురించి కామెంట్ చేసింది తానేనని ఓ వీడియో ద్వారా సదరు నెటిజన్ తెలిపాడు. తన కామెంట్ పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని అన్నాడు. గతంలో తాను ఎవరినీ ఇలా అనలేదని చెప్పాడు. కరోనా వల్ల తన ఉద్యోగం పోయిందని, ఎంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానని... అదే సమయంలో '800' వివాదం రాజుకుందని... చికాకులో ఆ కామెంట్ చేశానని అన్నాడు. ఇకపై ఎప్పుడూ ఇలా చేయనని తెలిపాడు.

విజయ్ సార్ కు, ఆయన కూతురుకి, భార్యకు, కుటుంబానికి క్షమాపణ చెపుతున్నానని అన్నాడు. తనను ఒక సోదరుడిలా భావించి క్షమించాలని కోరాడు. తన భార్య, పిల్లలు, కుటుంబం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వీడియోలో తన ముఖాన్ని బ్లర్ చేశానని చెప్పాడు. తాను చేసిన తప్పుకు కఠినమైన శిక్షకు తాను అర్హుడినేనని ఒప్పుకున్నాడు. అయితే, తనను చూసి కాకపోయినా... తన కుటుంబం కోసమైనా తనను క్షమించాలని కోరాడు.