ఆ కేటుగాడి తండ్రి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అట!: వర్ల రామయ్య

22-10-2020 Thu 13:18
  • హై టెక్నాలజీ ఉపయోగించి మెడికల్ పీజీ ఫైనల్ పరీక్షల్లో కాపీ
  • ఆ కాపీ రాయుడు మీద చర్యలు లేవట?
  • చర్యలు తీసుకోవాలంటే భయపడుతున్నారట?  
varla slams jagan

గత నెలలో గుంటూరు జిల్లాలోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో  పీజీ వార్షిక పరీక్షలు నిర్వహించగా, 24వ తేదీన జరిగిన పరీక్షలో ఓ విద్యార్థి  చెవిలో బ్లూటూత్‌ పెట్టుకొని పరీక్ష రాశాడని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ విద్యార్థిని రెడ్ ‌హ్యాండెడ్‌గా పట్టుకున్న లెక్చరర్లు  కాపీయింగ్‌ చేస్తున్నట్లు కేసు బుక్‌ చేశారని అందులో పేర్కొన్నారు. అయితే, ఆ విద్యార్థిని మూడేళ్ల పాటు పరీక్షలు రాయకుండా డిబార్‌ చేయలేదని, ఎందుకంటే అతడు గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడని, హెల్త్‌ వర్సిటీకి ఫోన్లు రావడంతో చర్యలు తీసుకోలేదని అందులో పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.

‘హై టెక్నాలజీ ఉపయోగించి మెడికల్ పీజీ ఫైనల్ పరీక్షలలో కాపీ కొట్టి, దొరికిన ఆ కేటుగాడు ఎవరు? ఆ కేటు గాని తండ్రి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అట. అందుకే ఆ కాపీ రాయుడు మీద చర్యలు లేవట? మెడికల్ యూనివర్సిటీ అంతా చర్యలు తీసుకోవాలంటే భయ పడుతున్నారట? నిజమా ముఖ్యమంత్రి గారూ?’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.