సీఎం జగన్ ను కలిసిన దివ్య తేజస్విని కుటుంబ సభ్యులు...రూ.10 లక్షల సాయం ప్రకటించిన సీఎం

20-10-2020 Tue 17:43
  • ఇటీవలే విజయవాడలో హత్యకు గురైన దివ్య తేజస్విని
  • తమకు న్యాయం చేయాలంటూ సీఎంను కోరిన కుటుంబ సభ్యులు
  • నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ
Divya Tejaswini family members met CM Jagan

ఇటీవలే విజయవాడలో ప్రేమోన్మాది కిరాతకానికి బలైన ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబ సభ్యులు ఈ సాయంత్రం సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన దివ్య తేజస్విని తల్లిదండ్రులు కుసుమ, జోసెఫ్ లతో పాటు ఆమె సోదరుడు సీఎం జగన్ ను కలిసి వినతి పత్రం అందించారు. తాము బిడ్డను పోగొట్టుకున్నామని, తమకు న్యాయం చేయాలని వారు సీఎంను కోరారు.

ఈ సందర్భంగా, ఆమె కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దివ్య తేజస్విని కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల సాయం ప్రకటించారు. వీరు సీఎంను కలిసిన సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ నేత దేవినేని అవినాశ్ కూడా అక్కడే ఉన్నారు.