Telakapalli Ravi: రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలకు తెలకపల్లి రవి కౌంటర్

Telakapalli Ravi gives counter to Raghu Rama Krishna Raju
  • జగన్ అభిమానిగా తెలకపల్లి రవి మారిపోయారన్న రఘురాజు
  • తాను పాలక వర్గాలను ప్రేమించనని చెప్పిన రవి
  • అమరావతి రైతులకు తాను మద్దతుగానే ఉన్నానని వ్యాఖ్య
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి జగన్ కు అభిమానిగా మారిపోయారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమరావతి రైతుల ప్రాణాలు పోతున్నా స్పందించని రవి... జగన్ గురించి మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రవి కౌంటర్ ఇచ్చారు. తాను ఏది మాట్లాడినా పూర్తి ఆధారాలతోనే మాట్లాడతానని చెప్పారు. రఘురాజు నవ్వుతూనే మాట్లాడారని... అభిమానం, భాష ఇలాంటివాటి గురించి మాట్లాడారని అన్నారు. తనను పొగుడుతూనే ఎక్కడకు పోయారు? ఏమై పోయారు? అనే సవాళ్లు విసిరారని చెప్పారు.

సాహితీ స్రవంతి అధ్యక్షుడిగా ఉండి కూడా ఇంగ్లీష్ మీడియం అంశంపై తాను మాట్లాడలేదని రఘురాజు అన్నారని తెలకపల్లి రవి చెప్పారు. సాహితీ స్రవంతి తరపున విజయవాడలో గతంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పడు 'చెయెత్తి జైకొట్టు తెలుగోడా... సొంత భాషలో చదవలేనోడా' అనే పాటను పాడానని... ఆ పాట యూట్యూబ్ లో కూడా వైరల్ అయిందని చెప్పారు. ఈ విషయాలను రఘురాజుగారు తెలుసుకోవాలని అన్నారు. చూడకుండా సవాళ్లు విసరడం సరికాదని చెప్పారు.

అమరావతి రైతులకు తాను తొలి నుంచి మద్దతుగా ఉన్నానని... గత ప్రభుత్వ హయాంలో కూడా రైతులు అన్యాయమైపోతున్నారనే ఉద్దేశంతో... అమరావతికి భ్రమరావతి అని పేరు పెట్టానని రవి తెలిపారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఇప్పటికే చాలా సార్లు చెప్పానని అన్నారు. దేశాన్ని, దేశ ప్రజలనే తాను ప్రేమిస్తానని, పాలకవర్గాలను ప్రేమించనని చెప్పారు. తాను ఏది చెప్పినా ప్రజల కోసమే చెపుతానని అన్నారు.
Telakapalli Ravi
Raghu Rama Krishna Raju
YSRCP

More Telugu News