బీహార్ ఎన్నికల్లో అభ్యర్థుల విన్యాసాలు... ఒకరు గేదెను ఎక్కి ప్రచారం చేస్తే, మరొకరు గేదెపై ఊరేగుతూ నామినేషన్!

19-10-2020 Mon 22:08
  • త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
  • గేదెను ఎక్కి ప్రచారం చేసిన అభ్యర్థి అరెస్ట్
  • ఆపై బెయిల్ పై విడుదల
Bihar assembly elections candidates uses buffaloes to campaigning

ఎన్నికల సమయంలో అభ్యర్థుల విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏదైనా చేస్తాం అనేలా వారి వ్యవహారశైలి ఉంటుంది. స్లమ్ ఏరియాల్లో పిల్లలకు స్నానాలు చేయించడం నుంచి ఇస్త్రీలు చేయడం, దోసెలు, పూరీలు వేయడం వంటి అనేక పనులను అవలీలగా చేసేస్తారు. ప్రస్తుతం బీహార్ లోనూ ఇవే తరహా దృశ్యాలు కనిపిస్తున్నాయి. బీహార్ లో మరికొన్నిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో మహ్మద్ పర్వేజ్ మన్సూరి అనే అభ్యర్థి ఓ గేదెను ఎక్కి ప్రచారం సాగించారు. చక్కగా ముస్తాబు చేసిన గేదె పైనుంచి ఆయన ప్రచారం చేస్తూ ముందుకు సాగిపోతుంటే ప్రజలు ఆశ్చర్యంతో తిలకించారు. మన్సూరి రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీకి చెందిన అభ్యర్థి. గయ నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తున్నారు. అయితే, ప్రచారానికి జంతువులను ఉపయోగించారన్న కారణంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. జంతు చట్టం అతిక్రమించడమే కాదు, కరోనా నియమావళి కూడా ఉల్లంఘించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఎలాగోలా బెయిల్ తెచ్చుకుని విడుదలయ్యారు.

ఇక మరో ఘటనలో దర్భంగా జిల్లా బహదరాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న నాచారి మండల్ అనే రైతు నామినేషన్ వేసేందుకు గేదెపై ఊరేగుతూ వచ్చాడు. తాను రైతుబిడ్డనని, తన వద్ద కూర్చోడానికి కుర్చీ కూడా లేదని వెల్లడించాడు. తాను పేదవాడ్నని, అందుకే గేదెపై వచ్చానని వివరించాడు. రైతుకు గేదెలు, ఆవులు, ఎద్దులే సంపద అని పేర్కొన్నాడు.