Rajasthan Royals: మరోసారి చేతులెత్తేసిన చెన్నై.. రాజస్థాన్‌పై దారుణ పరాజయం!
- పేలవంగా ఆడిన చెన్నై
- టోర్నీలోనే అత్యల్ప స్కోరు చేసిన ధోనీ సేన
- రాజస్థాన్‌ను గెలిపించిన జోస్ బట్లర్
చెన్నై సూపర్ కింగ్స్.. గత సీజన్ వరకు ఆ జట్టు ముందు ఇతర జట్లు పోటీ పడలేకపోయేవి. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో ప్రత్యర్థులను వణికించేది. ఐపీఎల్ ట్రోఫీని మూడుసార్లు అందుకున్న చెన్నై నేడు ఆటరాని జట్టులా ఆడుతోంది. పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్ ఆశలను వదులుకుంది. పోరాటమన్నదే మర్చిపోయి చేతులెత్తేసింది. ఆడిన పది మ్యాచుల్లో ఏడింటిలో ఓడి ఇంటికే పరిమితమైంది. ఇకపై ఆ జట్టు ఆడే మ్యాచ్‌లు నామమాత్రమే.
గత రాత్రి రాజస్థాన్, చెన్నై మధ్య ప్రారంభమైన మ్యాచ్, అభిమానులకు బోల్డంత వినోదాన్ని పంచుతుందని భావించారు. అట్టడుగున ఉన్న ఇరు జట్లు ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే గెలుపు అనివార్యం. దీంతో ఇరు జట్లు పోటాపోటీగా ఆడతాయని, ఐపీఎల్‌లో మరో పసందైన విందు లభించబోతోందని ఎదురుచూసిన సగటు ప్రేక్షకుడికి చెన్నై ఉసూరుమనిపించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో చచ్చీచెడి ఐదు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. శామ్ కరన్ (22), డుప్లెసిస్ (10), వాట్సన్ (8), రాయుడు (13), ధోనీ (28), జడేజా (35) వంటి ఆటగాళ్లు ఉన్న జట్టు ఒక్కో పరుగు కోసం శ్రమించింది. 100 పరుగుల స్కోరు సాధించేందుకు ఏకంగా 17 ఓవర్లు కావాల్సి వచ్చిందంటే చెన్నై బ్యాటింగ్ తీరు ఎలా సాగిందో చెప్పుకోవచ్చు.
దీనికి తోడు రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం గగనమైంది. చెన్నై ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క సిక్సర్ నమోదు కావడం బ్యాట్స్‌మెన్ ఆటతీరుకు అద్దం పడుతోంది. ధోనీ, జడేజాలు క్రీజులో ఉండడంతో పరుగుల వర్షం కురుస్తుందని భావించినప్పటికీ చివరి ఓవర్లో కూడా సింగిల్స్‌కే పరిమితమయ్యారు. జడేజా ఆమాత్రం పరుగులైనా చేశాడు కాబట్టి చెన్నై ఈ మాత్రం స్కోరునైనా ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది. ఈ టోర్నీలో తొలి బ్యాటింగ్‌లో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం.
అనంతరం 126 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కూడా తొలుత ఇబ్బంది పడింది. లక్ష్యం చిన్నదే అయినా ఛేదనలో పట్టు తప్పినట్టు కనిపించింది. బెన్‌స్టోక్స్ 19 పరుగులకే అవుట్ కాగా, గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన రాబిన్ ఉతప్ప ఈసారి 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. సంజు శాంసన్ మరోమారు (0) బ్యాటెత్తేశాడు. కెప్టెన్ స్మిత్ 26 పరుగులు చేయగా, చివర్లో జోస్ బట్లర్ 70 (48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి మరో 15 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ గెలుపుతో రాజస్థాన్ 4 విజయాలు, 8 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రాజస్థాన్ ఇకపై జరిగే నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. అద్భుత బ్యాటింగుతో జట్టుకు విజయాన్ని అందించిన బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.