Dinesh Karthik: కోల్ కతా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న దినేశ్ కార్తీక్... కొత్త కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్

Dinesh Karthik quits captaincy of KKR
  • బ్యాటింగ్ పై దృష్టి సారించాలని దినేశ్ కార్తీక్ నిర్ణయం
  • దినేశ్ కార్తీక్ నిర్ణయాన్ని స్వాగతించిన కోల్ కతా యాజమాన్యం
  • నేడు ముంబయి ఇండియన్స్ తో తలపడనున్న కోల్ కతా
ఐపీఎల్ తాజా సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మెరుగైన ఆటతీరుతో కొనసాగుతోంది. ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించింది. అయితే, ఇప్పటివరకు కెప్టెన్ గా వ్యవహరించిన వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. బ్యాటింగ్ పై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. జట్టుకు మరింతగా సేవలు అందించడమే తన ప్రాధాన్య అంశమని తెలిపాడు.

అతడి స్థానంలో ఇయాన్ మోర్గాన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్టు కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. కొత్త కెప్టెన్ గా నియమితుడైన మోర్గాన్ కు కార్తీక్ శుభాకాంక్షలు తెలిపాడు. మోర్గాన్ నాయకత్వంలో కోల్ కతా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు. కోల్ కతా జట్టు నేడు అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో బలమైన ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది.

దినేశ్ కార్తీక్ నిర్ణయంపై కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సీఈఓ వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో స్పందించారు. డీకే (దినేశ్ కార్తీక్) వంటి ముందుండి నడిపించే వ్యక్తులు జట్టులో ఉండడం తమ అదృష్టమని పేర్కొన్నారు. జట్టు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డీకే భావించేవాడని తెలిపారు. అతని నిర్ణయం తమను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలని అభిప్రాయపడ్డారు.

అయితే, డీకే మనోభావాలను తాము గౌరవిస్తామని, కొత్త కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్ బాధ్యతలు చేపడుతున్నాడని వెంకీ మైసూర్ వెల్లడించారు. 2019 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కెప్టెన్ అయిన ఇయాన్ మోర్గాన్ వంటి ఆటగాడు ఉండడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు వివరించారు. ఇప్పటివరకు కోల్ కతా వైస్ కెప్టెన్ గా ఉన్న ఇయాన్ మోర్గాన్ ఇకపై పూర్తిస్థాయి కెప్టెన్ అని స్పష్టం చేశారు.

More Telugu News

Dinesh Karthik
Captaincy
KKR
Eoin Morgan
IPL 2020