పిల్లి సుభాష్ చంద్రబోస్ అర్ధాంగి సత్యనారాయణమ్మ కన్నుమూత

13-10-2020 Tue 21:00
Pilli Subhash Chandrabose wife passed away
  • పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం
  • సత్యనారాయణమ్మ బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించినట్టు నిర్ధారణ
  • రేపు హసన్ బాదలో అంత్యక్రియలు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు భార్యా వియోగం కలిగింది. ఆయన భార్య పిల్లి సత్యనారాయణమ్మ అనారోగ్యంతో మరణించారు. ఆమె గత కొన్నిరోజులుగా హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం నుంచి ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వెంటిలేటర్ పై చికిత్స అందించినా ఆమె కోలుకోలేకపోయారు.

కాగా, సత్యనారాయణమ్మ మరణానికి కారణం బ్రెయిన్ స్ట్రోక్ అని వైద్యులు పేర్కొన్నారు. సత్యనారాయణమ్మ మృతితో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సత్యనారాయణమ్మ అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం హసన్ బాదలో జరగనున్నాయి. ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి హసన్ బాదకు తరలించారు.