సోనియాకు రాజీనామా లేఖ పంపిన ఖుష్బూ.. పార్టీని వీడుతుండడంపై వివరణ

12-10-2020 Mon 12:33
khushboo resigns congress
  • పార్టీలో కొందరు నేతలు వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా పనిచేస్తున్నారు
  • పార్టీ కోసం పనిచేస్తున్న నాలాంటి వారిని అణచివేస్తున్నారు
  • రాహుల్ గాంధీకి ధన్యవాదాలు  

సినీ నటి ఖుష్బూ సుందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, నేడు ఆమె బీజేపీలో చేరనున్నట్లు నిర్ధారణ అయింది. ఆమె ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఖుష్బూ తన రాజీనామా లేఖను పంపారు. పార్టీలో కొందరు నేతలు వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని,  పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వారిని అణచివేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

2014 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె చెప్పారు. తాను ప్రజల కోసం పనిచేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. అంతేగానీ, పేరు, ప్రతిష్ఠల కోసం కాదని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో కొన్ని శక్తులు తనను అణచివేశాయని, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో సహకరించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాసేపట్లో ఆమె ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.