K Kavitha: ఇక కవితకు మంత్రి పదవి ఖాయమేనా?

Who Will be Axed by KCR Discussion on Kavita win as MLC
  • ప్రస్తుతం ఫుల్ గా ఉన్న కేసీఆర్ క్యాబినెట్
  • కవితకు పదవి ఇవ్వాలంటే ఒకరిని తప్పించడం తప్పనిసరి
  • ఎవరిపై వేటు పడుతుందన్నది ఆసక్తికరం  
నిజామాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అందరూ అనుకున్నట్టుగానే విజయం సాధించారు. మొత్తం 823 ఓట్లకుగాను 728 ఓట్లు ఆమెకే పడటంతో విపక్షాల ప్రభావం నామమాత్రం కూడా లేదని నిరూపితమైంది. ఈ ఎన్నికల్లో కవిత గెలుస్తారని, ఆపై రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆమెను తీసుకుంటారని ఆది నుంచి ప్రచారం జరుగుతూ ఉండగా, ఇప్పుడు కవిత గెలవడంతో, మంత్రుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.

వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రి పదవులకు సంఖ్య సరిగ్గా సరిపోయింది. మంత్రులుగా కేవలం 17 మందికి మాత్రమే అవకాశం ఉంది. 17 మంది మంత్రులూ ఉన్నారు. కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే, ఎవరినో ఒకరిని తొలగించాల్సిందే. ఇదే ఇప్పుడు తెలంగాణ మంత్రుల్లో కొత్త గుబులును రేకెత్తిస్తోందని రాజకీయ విశ్లేషకులు చర్చలు ప్రారంభించారు.

కవితను మంత్రిగా తీసుకోవాలంటే, ఒకరిని తీసివేయక తప్పదు. కవిత కోసం ఎవరైనా తన పదవికి త్యాగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి తాజాగా ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు కేవలం 15 నెలల పదవీ కాలం మాత్రమే ఉంది. కానీ, ప్రభుత్వం ఇంకో నాలుగేళ్లు ఉంటుంది. అయితే, ఈ 15 నెలల పదవీ కాలం తరువాత, మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యే, లేదా ఎమ్మెల్సీగా గెలవడానికి ఆమెకు ఇంకో ఆరు నెలల సమయం ఉంటుంది. అంటే, దాదాపు మూడు నెలలు తక్కువ రెండేళ్ల పాటు కవిత మంత్రి పదవిలో కొనసాగవచ్చు. ఆ తర్వాత మళ్లీ ఎమ్మెల్సీగానో, ఎమ్మెల్యేగానో ఎన్నిక కావాల్సి ఉంటుంది.

ఇక ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే, ఎవరిపై వేటు పడుతుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఇదిలావుండగా, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కేసీఆర్ ముందు పెను సవాలు ఉన్నట్టేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఎవరినైనా తప్పిస్తే, కేసీఆర్ విమర్శలను ఎదుర్కోక తప్పదు. అది కాకుంటే, తన సామాజిక వర్గం లేదా, మరో ఉన్నత వర్గం నుంచి ఎవరినైనా తప్పించాలి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై సర్వత్ర చర్చ జరుగుతోంది. 
K Kavitha
MLC
Elections
KCR

More Telugu News