కమెడియన్‌ సూరిని రూ.2.70 కోట్ల మేర ముంచిన ఇద్దరు నిర్మాతలు!

10-10-2020 Sat 12:36
Producers cheated Comedian Soori
  • సూరిని మోసం చేసిన రమేశ్, అన్బువేల్ రాజన్
  • భూములు కొనిస్తామని డబ్బు వసూలు
  • అడయార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సూరి

ఇద్దరు నిర్మాతలు తనను రూ. 2.70 కోట్ల మేర మోసం చేశారని తమిళ హాస్య నటుడు పరోటా సూరి పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే అడయార్ ప్రాంతానికి చెందిన రమేశ్, అన్బువేల్ రాజన్ ఇద్దరూ కలిసి 'వీరధీర సూరన్' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నటించినందుకు రూ. 40 లక్షలు చెల్లించేలా సూరితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత కొంత డబ్బును సమకూర్చితే సిరుచేరి ప్రాంతంలో భూములు కొని, రిజిస్టర్ చేయిస్తామని సూరికి చెప్పారు. వారి మాటలను నమ్మిన సూరి... వాయిదాల రూపంలో 2 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాడు.

అయితే, నిర్మాతలు చూపించిన భూములను పరిశీలించిన సూరి... వాటికి రోడ్డు సౌకర్యం లేదని, పట్టా కూడా లేదని గుర్తించాడు. దీంతో, తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని అడిగాడు. డబ్బును తిరిగి చెల్లిస్తామని సూరికి  అగ్రిమెంట్ రాసిచ్చారు. అయితే, ఒప్పందం మేరకు డబ్బును చెల్లించకపోవడంతో అడయార్ పోలీసులకు సూరి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు ఈ కేసులో హీరో విష్ణు విశాల్ తండ్రి కూడా ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై విష్ణు విశాల్ స్పందిస్తూ... ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదని మండిపడ్డాడు. 2017లో సూరికి తమ విశాల్ స్టూడియోస్ నుంచి ఓ సినిమా కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చామని... ఇప్పటి వరకు ఆ డబ్బును ఆయన తిరిగి ఇవ్వలేదని తెలిపాడు.