Hyderabad: బాకీ డబ్బులు వసూలు చేసుకొస్తానని వెళ్లిన సినీ డిస్ట్రిబ్యూటర్ అదృశ్యం

Cinema distributor missing in Hyderabad
  • యూసుఫ్‌గూడ వెళ్లిన డిస్ట్రిబ్యూటర్ నగేశ్ అదృశ్యం
  • అతడు వెళ్లిన కార్యాలయం బయట చెప్పులు, బైక్
  • ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు
ఓ వ్యక్తికి ఇచ్చిన 5 లక్షల రూపాయల బాకీ సొమ్మును వసూలు చేసుకుని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్ వి.నగేశ్ అదృశ్యమయ్యారు. ఆయన ఆచూకీ గురించి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాదు, బేగంపేటకు చెందిన నగేశ్ (62) సినిమా డిస్ట్రిబ్యూటర్. యూసుఫ్‌గూడకు చెందిన సజ్జు అనే వ్యక్తికి ఆయన గతంలో 5 లక్షలు ఇచ్చారు. ఆ సొమ్మును వసూలు చేసుకుని వస్తానంటూ ఈ నెల 6న నగేశ్ ఇంట్లో చెప్పి వెళ్లారు. ఆ తర్వాత కుమార్తె సింధూజతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడారు.

అదే రోజు రాత్రి పదిన్నర గంటలకు ఆయన ఫోన్ స్విచ్ఛాప్ అయింది. తండ్రి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో సింధూజ కంగారుపడ్డారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో సజ్జు కార్యాలయానికి వచ్చిన సింధూజకు అక్కడ తన తండ్రి పాదరక్షలతోపాటు ఆఫీసు బయట ఆయన ద్విచక్ర వాహనం కూడా కనిపించింది. అయితే, నగేశ్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో ఆమె వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Cinema distributor
missing
Police

More Telugu News