Credit Card: క్రెడిట్, డెబిట్ కార్డుల నిబంధనలు మార్చిన ఆర్బీఐ... రేపటి నుంచే అమల్లోకి!

RBI New Rules From Tomorrow on Cards
షార్ట్స్‌లో చూడండి
రోజురోజుకూ బ్యాకింగ్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో, వాటికి అడ్డుకట్ట వేస్తూ, క్రెడిట్, డెబిట్ కార్డులకు మరింత రక్షణ కల్పించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గైడ్ లైన్స్ ను రూపొందించింది. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త విధానంలో భాగంగా కార్డుల సెక్యూరిటీ మరింతగా పెరుగుతుందని ఆర్బీఐ వెల్లడించింది.

ఇకపై క్రెడిట్ కార్డులను ఇంటర్నేషనల్, ఆన్ లైన్ లావాదేవీలకు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు వాడాలంటే, ముందస్తు అనుమతి తప్పనిసరి. బ్యాంకులు జారీ చేసే క్రెడిట్, డెబిట్ కార్డులు ఏటీఎంలలోనూ, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వద్ద మాత్రమే పనిచేస్తాయి. రిస్క్ తీసుకునే కస్టమర్లకు వారి నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు ఖాతాను జత చేస్తారు. అయితే, ఈ నిబంధన ప్రీ పెయిడ్, గిఫ్ట్ కార్డులకు మాత్రం వర్తించదు.

ఇక కస్టమర్లు తమ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వాడకంపై ముందుగానే పరిమితులను పెట్టుకోవచ్చు. ఈ పరిమితి దాటి కార్డు ద్వారా లావాదేవీకి ప్రయత్నిస్తే, వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ ఫోన్ కు సమాచారం అందుతుంది. కస్టమర్లు తమ కార్డులను ఏటీఎం, ఎన్ఎఫ్సీ, పీఓఎస్, ఈ-కామర్స్ లావాదేవీలకు వాడకుండా తాత్కాలికంగానూ నిషేధించుకోవచ్చు. తక్షణమే అన్ని బ్యాంకులు, కార్డులను జారీ చేసే కంపెనీలు డెబిట్, క్రెడిట్ కార్డుల ఆన్ లైన్ చెల్లింపు సేవలను తీసివేయాలని, కార్డు దారుడు కోరుకుంటేనే ఆ సౌకర్యాన్ని కల్పించాలని ఆర్బీఐ నుంచి ఆదేశాలు వెళ్లాయి. తమ కార్డులను విదేశాల్లో వాడుకోవాలనుకున్నా బ్యాంకు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి.

ఇక ఈ కొత్త నిబంధనలతో బ్యాంకుల మోసాలు తగ్గుతాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త కార్డులు జారీ అయితే, వాటి ద్వారా ఎలాంటి సేవలను పొందాలని భావిస్తున్నారో బ్యాంకుకు తెలిపి అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. ఇక, ప్రస్తుతం రోజులో రూ. 2 వేల వరకూ పిన్ ను ఎంటర్ చేయకుండానే కాంటాక్ట్ లెస్ లావాదేవీలను కూడా ఖాతాదారులు నియంత్రించుకోవచ్చు. ఇదిలావుండగా, పలు బ్యాంకులు ఇప్పటికే ఈ విధానాన్ని అవలంబిస్తూ, ట్రాన్సాక్షన్ లిమిట్స్ పెట్టుకునే సదుపాయాన్ని, తాత్కాలికంగా కార్డు లావాదేవీలను నిలుపుదల చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Credit Card
Debit Card
Online Transactions
RBI
Limit
New Rules

More Telugu News