India: భారతీయుల్లో కరోనా రోగ నిరోధక శక్తి ఇంకా రాలేదు: ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

  • రోగ నిరోధక శక్తి పెరిగేందుకు చాలా సమయం పడుతుంది 
  • త్వరలోనే ఐసీఎంఆర్ రెండో సీరో సర్వే వివరాలు
  • రెండోసారి కరోనా వచ్చిన వారి సంఖ్య నామమాత్రమే
  • కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్
Indians far from achieving herd immunity from Corona

భారతీయుల్లో కరోనాను నిరోధించగల వ్యాధి నిరోధక శక్తి ఇంకా పెరగలేదని, అందుకు చాలా సమయం పట్టవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో జరిగిన రెండో సీరో సర్వే వివరాలను వెల్లడించిన ఆయన, కరోనా వచ్చి, తగ్గిన వారిలోనూ తిరిగి వైరస్ ఆనవాళ్లు బయట పడుతున్నాయని, దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరిశీలనలు జరుపుతున్నారని అన్నారు.

సామాజిక మాధ్యమాల్లో తనను ఫాలో అవుతున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో తాజాగా ముచ్చటించిన ఆయన, ఐసీఎంఆర్ రెండో సీరో సర్వే నివేదిక అతి త్వరలోనే విడుదల కానుందని తెలిపారు. ప్రజల అలవాట్లను మార్చుకోవడం ద్వారానే ఈ వైరస్ ను దూరంగా ఉంచగలమని స్పష్టం చేసిన ఆయన, ఇంతవరకూ కొవిడ్-19కు వ్యాధి నిరోధక శక్తి పెరగలేదని అన్నారు. ప్రస్తుతానికి కరోనా రెండోసారి వచ్చిన వారి సంఖ్య నామమాత్రంగానే ఉందని, అయినా, ఈ విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నామని అన్నారు.

కరోనా వైరస్ కేవలం ఊపిరితిత్తులను మాత్రమే కాకుండా, మిగతా శరీర అవయవాలను సైతం ప్రభావితం చేస్తోందని, ఇన్ఫెక్షన్ కలిగించే తీవ్రతపై ఆరోగ్య నిపుణుల కమిటీలు అంచనా వేసే పనిలో ఉన్నాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా దశలవారీగా పాఠశాలల పునఃప్రారంభంపై స్పందిస్తూ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులపైనే ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ఇస్తున్న ఆదేశాలను ప్రజలు తు.చ. తప్పకుండా పాటించాలని కోరారు.

కొవిడ్-19 టెస్టింగ్ కు ఇప్పుడు నిర్ణయించిన ధరను తగ్గించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చామని, గతంలో టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్నందున ధర అధికంగా ఉండేదని, ఇప్పుడు దేశంలోనూ తయారవుతున్నందున ధరలను తగ్గించవచ్చని అన్నారు. ఇప్పుడు దేశంలో వెంటిలేటర్లు, పీపీఈలు తదితర ఎన్నో మెడికల్ డివైజెస్ భారీ ఎత్తున తయారవుతున్నాయని హర్షవర్ధన్ తెలిపారు.

అత్యున్నత నాణ్యత గల ఎన్నో టీకాలను, ఔషధాలను తయారు చేసే సత్తా ఇండియాకు ఉందని కరోనాకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే, పెద్దఎత్తున తయారు చేసేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

More Telugu News