Election Commissioner: బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల

  • బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు 
  • తొలి దశలో 71 నియోజక వర్గాల్లో పోలింగ్
  • రెండో దశలో 94 స్థానాల్లో, మూడో దశలో 78 స్థానాల్లో ఎన్నికలు
  • అక్టోబరు 28న తొలి విడత పోలింగ్
  • కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి
Bihar to vote in three phases says Chief Election Commissioner Sunil Arora

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా వివరాలు తెలిపారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో వెయ్యి మంది ఓటర్లను అనుమతిస్తామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు ఉంచుతామని అన్నారు.

బీహార్‌లో మొత్తం 7.29 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, కరోనా నిబంధనల మేరకు బీహార్‌లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కరోనా జాగ్రత్తలు విధిగా పాటించాల్సిందేనని తెలిపారు. బీహార్‌లో పోలింగ్‌ బూత్‌ల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు. అక్కడ భౌతిక దూరం నిబంధనను పాటించడం తప్పనిసరి చేస్తున్నామని తెలిపారు.

పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు ఇస్తామని తెలిపారు. వృద్ధులు, కరోనా రోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, పోస్టల్‌ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. పోలింగ్‌ సమయాన్ని గంట సేపు పెంచుతున్నామని తెలిపారు. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని, అయితే, కరోనా  భౌతిక దూరం వంటి నిబంధనల దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సారి పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు.

243 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు 
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతాయని వివరించారు. అందులో 38 సీట్లు ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వు సీట్లు ఉన్నాయని చెప్పారు. మూడు విడతల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. తొలి దశలో 71 నియోజక వర్గాల్లో, రెండో దశలో 94 స్థానాల్లో, మూడో దశలో 78 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అక్టోబరు 28న తొలి విడత పోలింగ్, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ పోలింగ్ ఉంటుందని వివరించారు. నవంబరు 10 ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. 

More Telugu News