కులాంతర వివాహం చేసుకున్న యువతి కిడ్నాప్.. గుంటూరులో కలకలం!

Married woman kidnapped in Guntur
  • ప్రేమ వివాహం చేసుకున్న వైశ్య యువతి, దళిత యువకుడు
  • యువతి తల్లిదండ్రుల నుంచి బెదిరింపులు
  • ప్రణయ్ మాదిరి హత్య చేస్తామని వార్నింగులు
పరువు కోసం కొందరు తల్లిదండ్రులు ఎలాంటి దారుణాలకైనా వెనకాడటం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల కంటే... తమ కుటుంబ పరువే ముఖ్యమని వారు భావిస్తున్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న ఎందరో యువత పరువు హత్యలకు కూడా గురయ్యారు. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరులో కలకలం రేపుతోంది. తమ కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆమెను కిడ్నాప్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన వైశ్య యువతి సౌమ్య, దళిత యువకుడు దిలీప్ ప్రేమించుకున్నారు. గత జూలై నెలలో వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. గుంటూరులో కాపురం పెట్టారు. పెళ్లైనప్పటి నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని సదరు యువకుడు వాపోయాడు. 'నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య గుర్తుందిగా... ప్రణయ్ మాదిరి హత్య చేస్తా'మంటూ యువతి తల్లిదండ్రులు తనకు వార్నింగులు ఇస్తూ బెదిరించారని చెప్పాడు.

అంతేకాదు పోలీసులతో తనను బెదిరింపజూశారని, ఆ తర్వాత ఇంట్లో ఉన్న తన భార్యను కిడ్నాప్ చేశారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన తల్లిని కొట్టారని ఆ యువకుడు తెలిపాడు. దీంతో, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి అతను ఫిర్యాదు చేశాడు. 
Go Back to Shorts
Guntur
Inter Caste Marriage
Women
Kidnap

More Telugu News