గర్భంలో ఉన్నది ఆడో, మగో తెలుసుకునేందుకు భార్య పొట్ట చీల్చిన కిరాతకుడు!

20-09-2020 Sun 18:00
Man slits pregnant wife stomach to know it is girl or boy child
  • యూపీలో దారుణం
  • కొడుకు పుట్టాలని కోరుకున్న వ్యక్తి
  • ఇప్పటికే ఐదుగురు కుమార్తెలు
  • లింగ నిర్ధారణ కోసం విపరీత చర్య

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య గర్భంలో ఉన్నది ఆడో, మగో తెలుసుకునేందుకు ఆమె పొట్ట చీల్చిన ఘటన వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. యూపీలోని నేక్ పూర్ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది.

పన్నాలాల్ అనే వ్యక్తికి ఇప్పటికే ఐదుగురు కూతుర్లు ఉన్నారు. అతని భార్య మరోసారి గర్భవతి అయింది. ఈసారి కూడా ఆడపిల్ల పుడితే ఎలా అని ఆందోళన చెందిన పన్నాలాల్ విపరీత చర్యకు దిగాడు. ఓ పదునైన వస్తువుతో భార్య పొట్ట చీల్చాడు. పొట్టలో ఉన్నది ఆడో, మగో తెలుసుకోవాలని భావించి ఈ విపరీతానికి ఒడిగట్టాడు.

భర్త విపరీత చేష్టకు ఆ గర్భవతి తల్లడిల్లిపోయింది. తీవ్ర రక్తస్త్రావంతో విలవిల్లాడిపోయింది. ఆమెను స్థానికులు  ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బరేలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కొడుకు పుట్టాలని కోరుకుంటున్న పన్నాలాల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమె ఆరేడు నెలల గర్భవతి అని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు పన్నాలాల్ ను అరెస్ట్ చేశారు.