Lalchand Bagri: పాకిస్థాన్ లో హిందూ వైద్యుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు

  • లాల్ చంద్ బాగ్రి అనే హిందూ డాక్టర్ ను హత్యచేసిన దుండగులు
  • గతేడాది నమ్రత అనే వైద్య విద్యార్థినిపై హత్యాచారం
  • పాక్ హిందూ సమాజంలో తీవ్ర ఆందోళన
Hindu doctor in Pakistan was killed in his house

పాకిస్థాన్ లో లాల్ చంద్ బాగ్రీ అనే హిందు వైద్యుడు హత్యకు గురయ్యారు. లాల్ చంద్ సింధ్ ప్రావిన్స్ లోని తాండో అల్లిహార్ ప్రాంతంలో వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఆయన తన నివాసంలోనే క్లినిక్ నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి ఆయన తన నివాసంలో ఉండగా, దుండగులు దారుణంగా చంపేశారు. కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి, పరారయ్యారు. తీవ్రగాయాలతో డాక్టర్ లాల్ చంద్ ప్రాణాలు విడిచారు.

ఈ ఘటనపై పొరుగింటి వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరన్నది తెలియరాలేదు. డాక్టర్ లాల్ చంద్ హత్య దర్యాప్తులో భాగంగా ఆయన స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.

కాగా, గతేడాది నమ్రతా చందాని అనే జూనియర్ డాక్టర్ కూడా కరాచీ సమీపంలో హత్యకు గురయ్యారు. లార్కనాలో ఆమె బీబీ ఆసిఫా మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. నమ్రత సోదరుడు కరాచీలో శస్త్రచికిత్సల నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నమ్రత గాళ్స్ హాస్టల్ లో ఉండగా ఆమెపై అత్యాచారం చేసిన దుండగులు, ఆపై హత్యచేశారు. ఈ విషయాలు పోస్టుమార్టం ద్వారా తెలిశాయి. అప్పట్లో ఈ ఘటన పాకిస్థాన్ లోని హిందూ సమాజంలో కలకలం రేపింది. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఈ ఘటనపై ఆక్రోశం వెళ్లగక్కాడు.

నమ్రత ఘటన అనంతరం కొంతకాలానికే మరో డాక్టర్ హత్య జరగడంతో మైనారిటీ హిందువుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, డాక్టర్ లాల్ చంద్ బాగ్రి హత్యను పాక్ పార్లమెంటు సభ్యుడు రమేశ్ కుమార్ వంక్వానీ నిర్ధారించారు.

More Telugu News