Corona Virus: సాల్మన్ చేపల్లో కరోనా వైరస్ మనుగడపై ఆసక్తికర అధ్యయనం

  • వివిధ ఉష్ణోగ్రతల వద్ద అధ్యయనం
  • 8 రోజుల వరకు సాల్మన్ చేపలపై కరోనా క్రిములు
  • జాగ్రత్తగా ఉండాలంటున్న పరిశోధకులు
Life time of corona virus on Salmon fishes

ప్రపంచాన్ని వేధిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ మనుగడపై ఇప్పటికీ నిశ్చిత అభిప్రాయాలు రావడంలేదు. అయితే ఇప్పటివరకు ఆహార పదార్థాలపై కరోనా వైరస్ ఉనికిపై ఆందోళనకరమైన సిద్ధాంతాలేవీ లేవు. కానీ తాజాగా చైనా పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. నిస్సందేహంగా ఇది కాస్త ఆలోచించదగ్గ విషయమే. ప్రపంచంలో అత్యధికులు ఎంతో ఇష్టపడి తినే చేపలు సాల్మన్ చేపలు. ఇవి ఎంతో ఖరీదైనవి కూడా. అయితే సాల్మన్ చేపల్లో కరోనా వైరస్ క్రిములు వారం రోజుల వరకు ఉంటాయని చైనా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు.

4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సాల్మన్ చేపలను నిల్వ ఉంచితే కరోనా వైరస్ 8 రోజుల పాటు సజీవంగా ఉంటుందని తెలిసింది. ఇక సాధారణ గది ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ వద్ద  కరోనా వైరస్ రెండు రోజులు జీవించి ఉండగలదని తేలింది. ఇక సాల్మన్ చేపలను ఎగుమతి చేసే సమయంలో వాటిని ఉంచే బాక్సుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. ఈ విధంగా అయితే వైరస్ 6 రోజులు మనుగడ సాగిస్తుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు. చైనా సీపుడ్ మార్కెట్ల ద్వారా ఈ వైరస్ రక్కసి వ్యాపించి ఉంటుందన్న వాదనలకు తాజా అధ్యయనం బలం చేకూర్చుతోంది.

ఇకమీదట చేపల ఎగుమతి, దిగుమతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని, తనిఖీలు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితిని ఈ అధ్యయనం చాటుతోందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డై మన్మాన్ పేర్కొన్నారు.

More Telugu News