Ajit doval: చైనా సరిహద్దుల్లో ఇక విశ్రాంతి లేని పని... సైన్యం రెడీ: అజిత్ దోవల్

  • సుదీర్ఘ కాలం పాటు పని పడింది
  • కర్తవ్యాన్ని నిర్వహించేందుకు సర్వం సన్నద్ధం
  • అవసరమైతే మరిన్ని బలగాలు
  • పలువురు ఉన్నతాధికారులతో దోవల్ సమావేశం
India is Fully Ready for Long Haul in China Border

చైనా సరిహద్దుల్లో భారత సైన్యానికి సుదీర్ఘ కాలం పాటు పని పడిందని, తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు జవాన్లు సిద్ధంగా ఉన్నారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సరిహద్దులకు ఆవలి వైపు నుంచి వచ్చే ఏ విధమైన ఉద్రిక్త పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా చైనా సరిహద్దుల్లో మరింత సైన్యాన్ని, అత్యాధునిక ఆయుధాలను మోహరించామని, అవసరమైతే, మరిన్ని బలగాలను పంపుతామని తెలిపారు. బార్డర్ లో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లపై ఉన్నతాధికారులతో సమావేశం జరిపిన ఆయన, పలు కీలక నిర్ణయాలను వెలువరించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశంలో అంతర్గత, విదేశీ వ్యవహారాల ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్, రా (రీసెర్చ్ అనాలిసిస్ వింగ్) కార్యదర్శి సుమంత్ గోయల్ తదితరులు పాల్గొని, చైనా నుంచి సమీప భవిష్యత్తులో ఎదురు కానున్న సమస్యలపై తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇదే సమావేశంలో కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా కూడా పాల్గొనడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

సమీప భవిష్యత్తులో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి, చైనా అనుసరిస్తున్న వ్యూహాన్ని బట్టి, భారత్ నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుందని సమావేశంలో పాల్గొన్న అధికారులు అభిప్రాయపడగా, ఏ మాత్రమూ వెనుకంజ వేసేది లేదని అజిత్ దోవల్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో భారీ ఎత్తున సైన్యాన్ని తరలించిన చైనా, వారికి మద్దతుగా నిలిచేందుకు యుద్ధ విమానాలను కూడా సమీప ఎయిర్ బేస్ లకు చేర్చినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

బార్డర్ లోని ఎత్తయిన ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకునేందుకు చైనా చేసిన ప్రయత్నాలను భారత్ విఫలం చేయగా, పాంగ్యాంగ్ సరస్సు, స్పాంగూర్ సరస్సుల చుట్టూ ఉన్న ప్రాంతాలపై మరింత కట్టుదిట్టమైన నిఘాను ఉంచాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు సైన్యానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు పోరాడాల్సి వుంటుందని, అందుకు సర్వదా సన్నద్ధంగా ఉన్నామని దోవల్ వ్యాఖ్యానించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలావుండగా, లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణ కుమార్, ఢిల్లీకి వచ్చి, కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై, అక్కడి పరిస్థితులపై సమగ్ర నివేదికను అందించారు. ఇండియా - చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, అక్కడికి తరలిస్తున్న యుద్ధ సామాగ్రి గురించిన వివరాలను ఆయన అందించారని సమాచారం.

More Telugu News