Narendramodi: డ్రగ్స్ దందాలో నరేంద్ర మోదీ బయోపిక్ నిర్మాత... సీబీఐ విచారణ జరుగుతుందన్న మహారాష్ట్ర!

  • సందీప్ సింగ్ పై ఎన్నో ఫిర్యాదులు
  • బీజేపీ నేతలతో ఆయనకు సంబంధాలు
  • మీడియాతో మహారాష్ట్ర హోమ్ మంత్రి
CBI Enquiry on Modi Bio Pic Producer

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వెనుక డ్రగ్స్ కోణం కూడా ఉందని, మహారాష్ట్రలో విచ్చలవిడిగా ఈ దందా సాుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్న వేళ, మహారాష్ట్ర హోమ్ శాఖా మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కీలక ప్రకటన చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, సినీ నిర్మాత సందీప్ ఎస్ సింగ్ మాదకద్రవ్యాల దందా చేస్తున్నాడని తనకు చాలా రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఆయన్ను విచారించనున్నామని అన్నారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ బయోపిక్ ను సందీప్ నిర్మించిన సంగతి తెలిసిందే.

సందీప్ సింగ్ ను సీబీఐ విచారిస్తుందని వ్యాఖ్యానించిన అనిల్ దేశ్ ముఖ్, బీజేపీ నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, వాటిపైనా విచారణ జరుగుతుందని అన్నారు. ఇప్పటికే తనకు అందిన ఫిర్యాదులను విచారణ అధికారులకు పంపించానని ఆయన వెల్లడించారు.

కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. అనిల్ దేశ్ ముఖ్ ఎన్సీపీకి చెందిన వారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనుక బీజేపీ కోణం కూడా ఉందని నమ్ముతున్నామని, దాని గురించి కూడా విచారిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇదే విషయమై స్పందించిన కాంగ్రెస్ నేత సచిన్ సావంత్, డ్రగ్స్ దందాలో సందీప్ సింగ్ పై వచ్చిన ఆరోపణలను సీబీఐ విచారిస్తుందని స్పష్టం చేశారు. ఇది చాలా తీవ్రమైన కేసని, పలువురు నిర్మాతలకూ ఈ దందాలో ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించారు.

More Telugu News