India: రష్యాతో యుద్ధ క్రీడలో పాల్గొనవద్దని భారత్ నిర్ణయం!

  • 15 నుంచి 26 వరకూ సైనిక విన్యాసాలు
  • తొలుత పాల్గొంటామని చెప్పిన భారత్
  • జాబితాలో రష్యాతో పాటు చైనా, పాకిస్థాన్
  • వైదొలగిన ఇండియా
India Decided Not to Participate in Military Excersise With Russia

వచ్చే నెలలో రష్యా, ఇండియా సంయుక్తంగా చేయాలని భావించినవార్ గేమ్స్ లో తాము పాల్గొనబోవడం లేదని అనూహ్యంగా ఇండియా ప్రకటించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఈ యుద్ధ విన్యాసాలు, క్రీడల్లో చైనా, పాకిస్థాన్ లు కూడా పాల్గొంటుండటమే, ఇండియా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది. దక్షిణ రష్యా ప్రాంతంలోని అస్త్రాఖాన్ రీజియన్ లో సెప్టెంబర్ 15 నుంచి 26 వరకూ ఈ యుద్ధ క్రీడలు నిర్వహిస్తామని, అందులో పాల్గొనాలని గత వారంలో రష్యా కోరగా, భారత్ అందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. 

అయితే, చైనా ఈ విన్యాసాల్లో పాల్గొనడమే, ఇండియా దూరం కావడానికి కారణమని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇండియన్ ఆర్మీ, ఇతర భద్రతా దళాల విభాగాలతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది. పాకిస్థాన్ తో వాస్తవాధీన రేఖ వెంబడి, చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితులే ఇండియా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని సమాచారం. కాగా ఈ యుద్ధ క్రీడల్లో షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ లో సభ్య దేశాలైన దాదాపు 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఇండియా వైదొలగడంతో క్రీడల్లో పాల్గొంటామని చెప్పిన మరికొన్ని దేశాలు కూడా పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. 

వచ్చే వారంలో రష్యాలో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇటువంటి నిర్ణయం వెలువడటం ద్వైపాక్షిక బంధంపై ప్రభావం చూపే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. కాగా, ఈ యుద్ధ క్రీడకు ఇండియా నుంచి 150 సైనిక దళాలను, 45 వాయుసేన సభ్యులను, పలువురు నౌకాదళ అధికారులను పంపాలని ఇండియా తొలుత నిర్ణయించింది. రక్షణ రంగంలో రష్యా, ఇండియాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఈ విన్యాసాల్లో పాల్గొనాలని ఇండియా నిర్ణయించుకుంది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో వెనక్కు తగ్గింది. 

More Telugu News