Hyderabad: హస్తిన ప్రజలకు శుభవార్త... సెప్టెంబర్ 7 నుంచి పరిమిత సంఖ్యలో మెట్రో రైళ్లు

Delhi Metro to Restart on september 7th
  • కొవిడ్ నిబంధనలన్నీ పాటించాల్సిందే
  • ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలోనే మెట్రో రైళ్లు 
  • ప్రజలు సహకరించాలన్న కేజ్రీవాల్ సర్కారు
దేశ రాజధాని న్యూఢిల్లీలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవలను పునరుద్ధరించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ లాక్ 4.0లో భాగంగా మెట్రో రైళ్లను తిరిగి నడిపించవచ్చని కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఢిల్లీ సర్కారు మెట్రోకు పచ్చజెండా ఊపింది. రైళ్లలో భౌతికదూరం, కూర్చునే సీట్లలో మరింత ఎడం పాటించడంతో పాటు ముఖానికి మాస్క్ లు, శానిటైజర్లను తప్పనిసరి చేస్తూ, ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే మెట్రో రైళ్లలో ప్రయాణాలకు అనుమతి ఉంటుందని, ప్రజలు ఇందుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

"కేంద్రం ఇచ్చిన విధి విధానాలకు అనుగుణంగా ఢిల్లీ మెట్రో సేవలు సెప్టెంబర్ 7 నుంచి పునఃప్రారంభం అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, పాటించాల్సిన నిబంధనలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది" అని డీఎంఆర్సీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. దశల వారీగా రైళ్ల సంఖ్యను పెంచుతామని, ప్రయాణికులంతా సహకరించాలని కోరింది.

కాగా, కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ, మార్చి 22 నుంచి ఢిల్లీ మెట్రో సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజా విధివిధానాల్లో మెట్రో సేవలను ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో డీఎంఆర్సీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Hyderabad
Arvind Kejriwal
Metro
New Delhi

More Telugu News