Jagan: నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై.. కేసీఆర్, జగన్ లకు లేఖ రాసిన స్టాలిన్

DMK chief Stalin writes a letter to Jagan and KCR
  • దేశమంతా కరోనాతో పాటు వరదలతో బాధపడుతోంది
  • నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది
  • ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలి
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులైన కేసీఆర్, జగన్ లకు డీఎంకే అధినేత స్టాలిన్ లేఖ రాశారు. నీట్, జేఈఈ పరీక్షల విషయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి ఆయన తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశమంతా కరోనాతో ఇబ్బంది పడుతోందని, ఇదే సమయంలో పలు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయని లేఖలో ఆయన గుర్తు చేశారు. భారీ వర్షాలతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయని... రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.

ఈ పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, చత్తీస్ గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయని స్టాలిన్ చెప్పారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని... ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంఘీభావం ప్రకటిస్తూ... మీరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని లేఖలో కోరారు. సంయుక్తంగా మనం తీసుకునే నిర్ణయం... దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. స్టాలిన్ విజ్ఞప్తి పట్ల మన ముఖ్యమంత్రులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Jagan
YSRCP
KCR
TRS
Stallin
DMK
NEET
JEE
Supreme Court
Exams

More Telugu News