C Kalyan: ప్రభుత్వం అనుమతించినా.. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ లు జరపడం కష్టమే!: నిర్మాత సి.కల్యాణ్

  • భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉండదు
  • నటీనటులు మాస్క్ లు వేసుకుని నటించలేరు
  • ఇప్పట్లో షూటింగ్స్ ప్రారంభం కాబోవన్న కల్యాణ్
Producer C Kalyan Comments on Re opening of Shootings

ఇటీవల సినిమా, టీవీ షూటింగ్స్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయంతో ఎటువంటి ఉపయోగమూ లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ విధివిధానాలతో షూటింగ్స్ ప్రారంభమయ్యే పరిస్థితి లేదని, దీనికి కారణం షూటింగ్స్ లో భౌతికదూరం పాటించలేమని, నటీనటులు మాస్క్ లు వేసుకుని నటించలేరని ఆయన అన్నారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనాకు వ్యాక్సిన్ వచ్చి, అది అందరికీ దగ్గరైన తరువాత మాత్రమే షూటింగ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి మాత్రం నటీనటులు, సహాయక సిబ్బంది ధైర్యంగా షూటింగ్స్ కు వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కరోనా సోకిన వారిలో రికవరీ రేటు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, కొందరు మరణిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో షూటింగ్ లు జరపడం కష్టమేనని అన్నారు. సమీప భవిష్యత్తులో పరిస్థితి చక్కబడుతుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3లో షూటింగ్స్ కు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే, కోవిడ్ నిబంధనలను చిత్ర యూనిట్ పాటించాలని, భౌతికదూరం, మాస్క్ లు, శానిటైజేషన్ తప్పనిసరని పేర్కొంది.  

More Telugu News