ఆరేళ్ల తర్వాత తొలిసారి.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్న గోదావరి
- 59 అడుగులకు చేరుకున్న నీటి మట్టం
- లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
- నేటి మధ్యాహ్నం సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
ఎగువ నుంచి వరద ఉప్పొంగుతుండడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలకు ముంపు పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు, వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో ఖమ్మం నుంచి భద్రాచలం వైపునకు రాకపోకలను నియంత్రిస్తున్నారు. అలాగే, భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలను నిలిపివేశారు. ఏజెన్సీ ప్రాంతాలకైతే రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.