Flight Crash: కోజికోడ్ వాతావరణం గురించి ముందుగానే పైలట్లకు హెచ్చరికలు: డీజీసీఏ వివరణ

AI Pilots Warned about Weather
  • పెనుగాలులు, వర్షం గురించి హెచ్చరించాం
  • అయితే వాతావరణం అదుపు తప్పిన పరిస్థితి లేదు
  • లోతైన విచారణ జరిపిస్తున్నామన్న డీజీసీఏ
కోజికోడ్ లో వాతావరణం బాగాలేదని, భారీ వర్షాలు కురుస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని దుబాయ్ నుంచి వందేభారత్ మిషన్ లో భాగంగా వస్తున్న ఎయిర్ ఇండియా విమానం పైలట్లకు ముందుగానే సమాచారాన్ని అందించామని డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ప్రతినిధి అరుణ్ కుమార్ వెల్లడించారు.

శుక్రవారం నాడు ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పడంతో ఇద్దరు పైలట్లు సహా 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. పెనుగాలులు, వర్షం గురించి పైలట్లకు తెలుసునని, అయితే వాతావరణం పూర్తిగా అదుపుతప్పలేదని, అందువల్లే వారు ల్యాండింగ్ కు ప్రయత్నించారని అరుణ్ వివరించారు. ఈ ప్రమాదానికి వాతావరణ పరిస్థితులే కారణమని ఆయన అన్నారు.

"ఏటీసీ నుంచి పైలట్లకు వాతావరణంపై సమాచారం వెళ్లింది. విమానం రన్ వే చివర్లో వేగంగా ల్యాండ్ అవడాన్ని గమనించిన ఏటీసీ, వెంటనే రెస్క్యూ టీమ్ లను అప్రమత్తం చేసింది. ఫైర్ ఫైటర్లు సహా సహాయక సిబ్బంది వెంటనే స్పందించారు. విమానం దగ్గరకు నిమిషాల్లోనే వెళ్లారు" అని ఆయన తెలిపారు. విమానం ప్రమాదానికి గురైన 10 నిమిషాల వ్యవధిలోనే రెస్క్యూ ప్రారంభమైందని వెల్లడించారు. విమానం క్రాష్ ల్యాండ్ అయిన తరువాత, కాక్ పిట్ నుంచి ఏటీసీకి ఏమైనా సమాచారం అందిందా? అన్న ప్రశ్నకు విచారణ తరువాతే ఈ విషయమై సమాచారం లభిస్తుందని తెలిపారు.

కాగా, రన్ వే ప్రారంభమైన కిలో మీటర్ తరువాత విమానం వేగంగా వచ్చి ల్యాండ్ కావడం, సురక్షితంగా విమానాన్ని నిలిపేంత రన్ వే అక్కడ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని డీజీసీఏ ప్రాథమిక విచారణలో తేల్చింది.  ఈ ప్రమాదానికి గల కారణాలపై లోతైన దర్యాఫ్తు చేసేందుకు విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి ఓ టీమ్ వచ్చే వారంలో ఇండియాకు రానుంది.
Flight Crash
Kerala
Weather

More Telugu News