USA: ట్రంప్ ఓడిపోవాలని గట్టిగా కోరుకుంటున్న చైనా: యూఎస్ ఇంటెలిజెన్స్

  • చైనాతో పాటు ఇరాన్ ఉద్దేశం కూడా అదే
  • ట్రంపే ఉండాలని కోరుకుంటున్న రష్యా
  • కౌంటర్ ఇంటెలిజెన్స్ నివేదిక
China and Iran Wants Trump Defete

ఈ సంవత్సరం నవంబర్ లో జరగనున్న యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో  ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవాలని చైనా కోరుకుంటోందని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. చైనాతో పాటు ఇరాన్ కూడా ట్రంప్ ఓడిపోవాలని కోరుకుంటోందని, రష్యా మాత్రం ట్రంప్ ప్రత్యర్థి జోయ్ బిడెన్ కు వ్యతిరేకంగా పనిచేస్తోందని నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ డైరెక్టర్ విలియమ్ ఇవాన్నా ఓ ప్రకటనలో వెల్లడించారు. చాలా దేశాలు ట్రంప్ కు వ్యతిరేకంగా పనిచేస్తూ, కోవర్ట్ గా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తమ తాజా నిఘాలో ఈ విషయం వెల్లడైందని అన్నారు. ఈ ఎన్నికలను ప్రభావితం చేయడం, ట్రంప్ ను ఓడగొట్టడమే వారి ఉద్దేశమని తెలుస్తోందని తన రిపోర్టులో వెల్లడించారు.

ఈ జాబితాలో చైనా ముందు నిలిచిందని, తమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ ఉండరాదని ఆ దేశం భావిస్తోందని, ముఖ్యంగా హాంకాంగ్ విషయంలో అమెరికా కల్పించుకోవడం, టిక్ టాక్ పై కఠిన నిర్ణయాలు తదితర విషయాల్లో చైనా ఏ మాత్రమూ సంతృప్తికరంగా లేదని ఆయన అన్నారు. ఇరాన్ సైతం రెండోసారి ట్రంప్ అధికారంలోకి వస్తే, తమపై విరుచుకుపడతారన్న ఆలోచనలో ఉందని, తమ దేశానికి ముప్పు రాకూడదంటే, ట్రంప్ గెలవరాదని భావిస్తూ, అందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.

ఇక గత ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు వ్యతిరేకంగా పనిచేసి, ట్రంప్ గెలిచేందుకు తనవంతు సాయం చేసిన రష్యా, ఈ దఫా జో బిడెన్ కు వ్యతిరేకంగా పనిచేస్తూ, సోషల్ మీడియా, టీవీ చానెళ్ల ద్వారా ఆయన అభ్యర్థిత్వాన్ని బలహీనపరచాలని చూస్తోందని ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది.

More Telugu News