Krishna River: 2 లక్షల క్యూసెక్కులు దాటిన కృష్ణా వరద... అన్ని కెనాల్స్ కూ నీరు!

Heavy Flood in Srisailam
  • ఈ సీజన్ లో తొలిసారిగా భారీ వరద
  • పశ్చిమ కనుమలలో భారీ వర్షాలే కారణం
  • రాజమండ్రి వద్ద గోదావరిలో లక్ష క్యూసెక్కులకు పైగా నీరు

ఈ సీజన్ లో తొలిసారిగా కృష్ణానదిలోకి 2 లక్షల క్యూసెక్కుల వరదల ప్రవాహం నమోదైంది. దీంతో రిజర్వాయర్ నుంచి సాగే అన్ని కెనాల్స్ కూ అధికారులు నీటి విడుదలను ప్రారంభించారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో గంటగంటకూ ప్రవాహం పెరుగుతోంది. రాత్రి 12 గంటల సమయానికే 2 లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. ప్రస్తుతం వస్తున్న వరదతో శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాలు సైతం నిండిపోతాయని అధికారులు అంటున్నారు.

ముఖ్యంగా పశ్చిమ కనుమలతో పాటు కృష్ణా నది ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటమే ఇంతటి వరదకు కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్మట్టి డ్యామ్ ఇంకా పూర్తిగా నిండనప్పటికీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సూచనల ప్రకారం, నిల్వ ఉంచిన నీటిని ఖాళీ చేస్తున్నారు. మరోవైపు నారాయణపూర్ నుంచి కూడా వరద వస్తుండటంతో, జూరాల పూర్తిగా నిండిపోగా, వచ్చిన నీటిని వచ్చినట్టు శ్రీశైలానికి వదులుతున్నారు.

తుంగభద్ర రిజర్వాయర్ వద్ద పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. అప్పర్ తుంగతో పాటు, భద్ర జలాశయం, సింగటలూరు జలాశయం నుంచి కూడా భారీగా వరద నీటిని వదులుతుండటంతో ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 560 అడుగులకు చేరుకుంది. ఇక గోదావరి విషయానికి వస్తే, క్రమంగా వరద పెరుగుతుండగా, రాజమండ్రి వద్ద 1.17 లక్షల ప్రవాహం నమోదైంది. డెల్టా కాలువలకు 7 వేల క్యూసెక్కుల నీటిని, మిగతా వరదను సముద్రంలోకి వదులుతున్నారు.

  • Loading...

More Telugu News