Ammonium Nitrate: చెన్నైలో 697 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు... బీరుట్ ఘటన నేపథ్యంలో వేలం వేసేందుకు నిర్ణయం!

  • బీరుట్ లో భయానక పేలుడు
  • విధ్వంసం సృష్టించిన అమ్మోనియం నైట్రేట్
  • చెన్నైలో ఓ కంటైనర్ కేంద్రంలో భారీ నిల్వలు
Huge Ammonium Nitrate deposits in Chennai and officials set auctiuon

లెబనాన్ రాజధాని బీరుట్ లో జరిగిన అత్యంత భయానక పేలుడు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 135 మంది చనిపోగా, 4 వేల మంది క్షతగాత్రులయ్యారు. ఈ పేలుడు ధాటికి నగరం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ అణుబాంబు శక్తిలో ఐదో వంతు శక్తి ఈ పేలుడు కారణంగా వెలువడిందన్న అంచనాలు భీతిగొలుపుతున్నాయి. ఈ బీభత్సానికి కారణం అమ్మోనియం నైట్రేట్. పొలాల్లో ఎరువులకు ఉపయోగించే ఈ రసాయనం కొద్దిగా డోసు పెంచితే విస్ఫోటనాలు సృష్టించగలదు. ఇప్పుడు అమ్మోనియం నైట్రేట్ అంటే ప్రపంచదేశాలు ఉలిక్కిపడుతున్నాయి. భారత్ లోనూ అదే పరిస్థితి నెలకొంది.

చెన్నైలో ఓ కంటైనర్ కేంద్రంలో 697 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉండడమే అందుకు కారణం. బీరుట్ లో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో చెన్నైలో ఉన్న అమ్మోనియం నైట్రేట్ ను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఇంత పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచడం ప్రమాదకరమని భావిస్తున్నారు.

తమిళనాడుకు చెందిన ఓ దిగుమతిదారుడి నుంచి 2015లో ఈ అమ్మోనియం నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు.  తాను దిగుమతి చేసుకున్న రసాయనం వ్యవసాయ రంగంలో ఎరువుగా ఉపయోగించేదని ఆ దిగుమతిదారుడు పేర్కొన్నా, అధికారుల తనిఖీల్లో అది పేలుడు పదార్థం స్థాయిలో ఉందని, వ్యవసాయిక ఎరువు కంటే దాని తీవ్రత అధికంగా ఉందని తేలింది. దాంతో, 1.80 కోట్ల విలువైన ఆ అమ్మోనియం నైట్రేట్ ను అధికారులు జప్తు చేశారు.

అయితే, లెబనాన్ రాజధాని బీరుట్ లో అమ్మోనియం నైట్రేట్ సృష్టించిన విధ్వంసంతో చెన్నైలో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. అటు, పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖ కేంద్ర విభాగం దేశవ్యాప్తంగా గోదాములు, పోర్టుల్లో ఉన్న  రసాయన నిల్వలు సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని, 48 గంటల్లో వాటి పరిస్థితి సమీక్షించాలని అధికారులను ఆదేశించింది. ఇక, చెన్నైలో ఉన్న 697 టన్నుల్లో 7 టన్నులు అప్పటి వరదల్లో దెబ్బతినగా, మిగిలిన 690 టన్నులను ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.

More Telugu News