Miner Girl: బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి బెయిల్ మంజూరు ఇస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసిన బాంబే హైకోర్టు

  • బాలికకు మానసిక పరిపక్వత ఉంది
  • ఆమె అంగీకారంతోనే లైంగిక చర్య జరిగిందని భావిస్తున్నాం
  • హుసేన్ అనే వ్యక్తితో లైంగిక సంబంధం ఉందని చెప్పింది
Bombay High Court grants bail to a man who raped miner girl

14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలు వ్యవహరించిన తీరు ఆమె మానసిక పరిపక్వతను సూచిస్తోందని వ్యాఖ్యానించింది.

చెన్నై నుంచి ఇద్దరు అపరిచితులతో కలిసి ఆమె ముంబైకి వచ్చిందని... ఇక్కడకు వచ్చిన తర్వాత హుసేన్ అనే వ్యక్తిని కలిసిందని తెలిపింది. అతనితో ఆమెకు లైంగిక సంబంధం ఉందని చెప్పింది. వీరి వ్యవహారాన్ని గమనించిన కొందరు ఆమెను పోలీస్ స్టేషన్లో అప్పగించారని తెలిపింది. మరో అపరిచిత వ్యక్తిని తన కుటుంబసభ్యుడిగా పేర్కొంటూ స్టేషన్ నుంచి ఆమె వెళ్లిపోయిందని చెప్పింది. వీటన్నింటినీ గమనిస్తుంటే ఆమె అంగీకారంతోనే లైంగిక చర్య జరిగిందని భావించాల్సి వస్తోందని తెలిపింది. నిందితుడికి రూ. 30 వేల వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేస్తున్నామని తీర్పును వెలువరించింది.

కేసు వివరాల్లోకి వెళ్తే, 2019 జూన్ 14న తన కూతురు కనిపించడంలేదంటూ ఆమె సవతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సవతి తల్లి పెట్టే బాధలను భరించలేక సదరు బాలిక ఇంటి నుంచి పారిపోయింది. రోడ్ల మీద దిక్కుతోచకుండా తిరిగింది. ఆ తర్వాత ముంబై రైల్వే స్టేషన్ కు చేరుకుని, అక్కడి నుంచి చెన్నై వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ముంబైకి వచ్చింది. ఈ క్రమంలో తనపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారంటూ 2019 జూలై 10న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో థ్యానేశ్వర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును విచారించిన కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.

More Telugu News