ఆస్తిలో వాటా అడిగిన ప్రియురాలిని ఖతం చేసిన ప్రియుడు

16-07-2020 Thu 17:14
  • 15 ఏళ్లుగా కొనసాగుతున్న అక్రమ సంబంధం
  • ప్రియురాలి ఇంటిని పోషిస్తున్న ప్రియుడు
  • ఆస్తి అడిగినందుకు చంపి, పాతేసిన ప్రియుడు
Man killed his lover in Karnataka

ఆస్తిలో వాటా అడిగిందనే కోపంలో ప్రియురాలిని ప్రియుడు చంపేసి, పాతిపెట్టిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే బళ్లారి జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా గిరిగూండనహల్లి గ్రామానికి చెందిన హులిగమ్మ (42)కు అదే జిల్లాలోని హోస్పేట్ కు చెందిన వ్యక్తితో చాలా ఏళ్ల క్రితమే పెళ్లైంది. అయితే కుటుంబ కలహాలతో భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. అదే గ్రామానికి చెందిన సిద్ధలింగప్పతో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది.

ఈ క్రమంలో గత 15 ఏళ్లుగా ఆమె కుటుంబాన్ని కూడా సిద్ధలింగప్ప పోషిస్తున్నాడు. అయితే అతనికి ఆస్తులు ఉండటంతో... ఆస్తిలో వాటాను ఇవ్వాలని గత కొంత కాలంగా ఆమె డిమాండ్ చేస్తోంది. నెలనెలా ఎంతో కొంత ఇస్తున్నప్పుడు ఆస్తిలో వాటా ఎందుకు ఇవ్వాలని ఆమెను అడిగాడు. ఈ విషయం పెద్దదై ప్రతిరోజు వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో, ఆమె అడ్డును తొలగించుకోవాలని అతను ప్లాన్ వేశాడు. తన పొలానికి  తీసుకెళ్లి ఆమెను చంపేసి, తన పొలంలోనే పాతిపెట్టి వెళ్లిపోయాడు.

గత రెండు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును విచారిస్తుండగా హులిగమ్మకు అక్రమ సంబంధం ఉందనే విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే సిద్ధలింగప్పను అదుపులోకి తీసుకుని విచారించగా అతను నిజాన్ని ఒప్పుకున్నాడు. నిన్న పొలం వద్దకు వెళ్లి హులిగమ్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేయించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తరలించారు.