AV Subbareddy: అఖిలప్రియను అరెస్ట్ చేయాలి... కుమార్తెతో కలసి కడప ఎస్పీని కలిసిన ఏవీ సుబ్బారెడ్డి

AV Subbareddy met Kadpa SP Anburajan along with his daughter and asks to arrest Akhilapriya
  • అఖిలప్రియ తన హత్యకు సుపారీ ఇచ్చిందన్న ఏవీ
  • అఖిలప్రియను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై అసంతృప్తి
  • వారిని అలాగే వదిలేస్తే తనపై దాడి జరగొచ్చని ఆందోళన
రాయలసీమ టీడీపీ వ్యవహారాల్లో ఇటీవల భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల పేర్లు తరచుగా వినిపిస్తున్నాయి. తనను హత్య చేసేందుకు భూమా అఖిలప్రియ సుపారీ ఇచ్చిందంటూ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, ఏవీ సుబ్బారెడ్డి, తన కుమార్తె జస్వంతితో కలిసి కడప ఎస్పీ అన్బురాజన్ ను కలిశారు. భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయాల్సిందేనని కోరారు.

ఈ కుట్ర వ్యవహారంలో ఏ1 నుంచి ఏ6 వరకు అరెస్టు చేసిన పోలీసులు ఏ4 అయిన భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయకపోవడం ఏంటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము నోటీసులు ఇచ్చినా అఖిలప్రియ కుటుంబం నుంచి స్పందన లేదని, వాళ్లకు ముందస్తు బెయిల్ వస్తే తనపై దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వెలిబుచ్చారు.

ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి కూడా ఈ విషయంలో స్పందించారు. మహిళ ముసుగులో హత్యా రాజకీయాలు చేస్తోందంటూ అఖిలప్రియపై మండిపడ్డారు. ఆమెను, ఆమె భర్త భార్గవరామ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు.
AV Subbareddy
Jaswanthi
AKhilapriya
Supari
Telugudesam

More Telugu News