Clinical Trials: వ్యాక్సిన్ తయారీలో రష్యా సూపర్ ఫాస్ట్... ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి

  • కరోనా వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా పరిశోధనలు
  • రష్యాలో వ్యాక్సిన్ రూపొందించిన గమాలెయ్ ఇన్ స్టిట్యూట్
  • వచ్చేవారం డిశ్చార్జి కానున్న వలంటీర్లు
Corona vaccine clinical trials completed in Russia

కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ (ఆస్ట్రాజెనెకాతో కలిసి ప్రయోగాలు), చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ సంస్థ, భారత్ లో భారత్ బయోటెక్ సంస్థలు వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయి. ఇవన్నీ జంతువులపై ప్రయోగాలు పూర్తిచేసి క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. అయితే, రష్యా పరిశోధకులు మాత్రం చాపకింద నీరులా ప్రయోగాలు చేపట్టి ప్రపంచదేశాలను విస్మయానికి గురిచేశారు.

మాస్కోలోని సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీలో క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. వలంటీర్లకు ఇచ్చిన వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇచ్చినట్టు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యాక్సిన్ ను గమాలెయ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ రూపొందించింది. జూన్ 18 నుంచి తొలి దశ క్లినికల్ ట్రయల్స్ షురూ చేయగా, వ్యాక్సిన్ వేయించుకున్న వలంటీర్లు వచ్చే వారం డిశ్చార్జి కానున్నారు. మరికొందరు వలంటీర్లు ఈ నెల 20న డిశ్చార్జి అవుతారు.

వ్యాక్సిన్ సురక్షితమైనదా కాదా అనే విషయాన్ని పరీక్షించడమే ఈ క్లినికల్ ట్రయల్స్ ఉద్దేశం అని సెచెనోవ్ వర్సిటీలోని  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసైటాలజీ, ట్రాపికల్ అండ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ తెలిపారు. ఈ విషయంలో తాము విజయవంతం అయ్యామని అన్నారు. తదుపరి దశలో ఎలాంటి పరీక్షలు చేపట్టాలన్నది వ్యాక్సిన్ రూపకర్తలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, ఉత్పత్తి దిశగా దృష్టి సారించే అవకాశాలున్నాయని వివరించారు.

More Telugu News