Brazil: కరోనా వాక్సిన్ ప్రయోగాలకు బ్రెజిల్ ను ఎంచుకుంటున్న పరిశోధక సంస్థలు.. ఎందుకంటే..!

Research firms goes to Brazil for corona vaccine clinical trails
  • కీలక దశకు చేరిన కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు
  • బ్రెజిల్ బాటపట్టిన ఆక్స్ ఫర్డ్, సినోవాక్ బయోటెక్
  • బ్రెజిల్ లో సామాజిక సంక్రమణం దశలో కరోనా వ్యాప్తి
కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం చూస్తోంది. అనేక సంస్థలు కరోనా వ్యాక్సిన్ విషయంలో పురోగతి సాధించి, మనుషులపై ప్రయోగాలకు తెరలేపాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ గురించే. ఆస్ట్రాజెనెకాతో జట్టుకట్టిన ఆక్స్ ఫర్డ్ వర్సిటీ సీహెచ్ఏడీఓఎక్స్1 ఎన్ కోవ్-19 పేరిట వ్యాక్సిన్ ను తీసుకువస్తోంది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ఆరంభించింది. అటు సినోవాక్ బయోటెక్ కరోనావాక్ పేరుతో వ్యాక్సిన్ కు రంగం సిద్ధం చేస్తోంది.

అయితే, కీలకమైన క్లినికల్ ట్రయల్స్ కు ఈ సంస్థలు బ్రెజిల్ దేశాన్నే ఎంచుకున్నాయి. ఎందుకంటే బ్రెజిల్ లో ప్రస్తుతం కరోనా మహమ్మారి సామాజిక సంక్రమణం దశలో కొనసాగుతూ పతాక స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ఈ ప్రదేశానికి గణనీయమైన వైద్యపరమైన అనుభవం చేకూరింది. ఈ అనుభవం వ్యాక్సిన్ పరిశోధన సంబంధిత అంశాలకు ఎంతగానో తోడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మానవులపై ప్రయోగాలు చేస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయన్నది పరిశోధన సంస్థల భావన. ప్రపంచ ప్రజలకు అత్యంత త్వరగా కరోనా వ్యాక్సిన్ అందించాలంటే బ్రెజిల్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుకూలమని బ్రెజిల్ లోని బుటాంటన్ ఇన్ స్టిట్యూట్ క్లినికల్ రీసెర్చ్ మెడికల్ డైరెక్టర్ రికార్డో పలాసియోస్ వివరించారు.

ప్రస్తుతం బ్రెజిల్ లో 16 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 65,556 మంది మృత్యువాత పడ్డారు. నిత్యం వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తమ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు ఇదే అనువైన దేశంగా భావించిన ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అక్కడి ఫెడెరల్ యూనివర్సిటీ ఆఫ్ సావోపాలోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి లేమాన్ ఫౌండేషన్ నిధులు సమకూర్చుతోంది.

అటు, చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ స్థానికంగా పరిశోధన రంగంలో కాకలుతీరిన బుటాంటన్ ఇన్ స్టిట్యూట్ తో చేయికలిపింది. దాంతో ఈ దక్షిణ అమెరికా దేశం కరోనా వ్యాక్సిన్ పోటీకి కదనక్షేత్రంగా మారింది. ఏ పరిశోధన సంస్థ విజయం సాధించినా అది ప్రపంచ మానవాళికి శుభపరిణామమే అవుతుంది.
Brazil
Corona Virus
Vaccine
Oxford
Astrazeneca
Cinovac
China

More Telugu News