Vijayashanti: కేసీఆర్ విఫలమవడంతో గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు: విజయశాంతి

Vijayasanthi fires on CM KCR over corona situations in Telangana
  • కేసీఆర్ తప్పులు పెరిగిపోతున్నాయన్న విజయశాంతి
  • కరోనా అంశంలో కేసీఆర్ చేతులెత్తేశారని విమర్శలు
  • తిరుగుబాటు ఎదుర్కొనే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యలు
తెలంగాణలో కరోనా రక్కసి విశృంఖలంగా వ్యాపిస్తుండడం పట్ల కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. శిశుపాలుడి తప్పుల్లా తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాతీర్పు తనకే అనుకూలం అని విర్రవీగుతున్న దొరగారికి ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొనే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు.

ప్రతి విషయంలో మాయ మాటలు చెబుతూ, ఉచిత సలహాలు ఇస్తూ తనను మేధావిగా చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడు కరోనా మహమ్మారిని కట్టడి చేయడం చేతకాక చేతులెత్తేశారని, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని వివరించారు.

"కరోనా వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే వాటిని అవహేళన చేశారు.  తగిన వైద్య వసతులు లేవని మీడియాలో వార్తలు వస్తే వాటి యాజమాన్యానికి శాపనార్థాలు పెట్టారు. కరోనా పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని హైకోర్టు తప్పుబట్టినా సీఎం దొర ఏమాత్రం పట్టించుకోలేదు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి గవర్నర్ తమిళిసై స్వయంగా జోక్యం చేసుకుని సంక్షోభ నివారణకు చొరవ ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ తన బాధ్యతల నిర్వహణలో విఫలం కావడంతో గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. గవర్నర్ చొరవను కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం సీఎం దొర నిరంకుశత్వానికి పరాకాష్ఠ అనే మాటలు వినిపిస్తున్నాయి" అంటూ విజయశాంతి ట్విట్టర్ లో ధ్వజమెత్తారు.
Vijayashanti
KCR
Corona Virus
Telangana
Governor
Tamilisai Soundararajan

More Telugu News