బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశ్ స్మగ్లర్ల అటాక్!

05-07-2020 Sun 08:45
  • బంగ్లా సరిహద్దుల్లో ఘటన
  • డ్రగ్స్ ను దేశంలోకి తెస్తుంటే చూసిన జవాన్లు
  • అడ్డుకోవడంతో కర్రలు, కత్తులతో దాడి
  • ముగ్గురు జవాన్లకు గాయాలు
Three BSF Jawans Injured in Border After Bangladesh Smugglers Attack

పశ్చిమ బెంగాల్ ను ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ - ఇండియా అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కొందరు స్మగ్లర్లు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లపై దాడికి దిగడం కలకలం రేపింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఘటన నార్త్ 24 పరగణాస్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి జరిగింది. బాన్స్ ఘాటా పోస్ట్ వద్ద కాపలాగా ఉన్న సరిహద్దు భద్రతా దళ సిబ్బందిపై స్మగ్లర్లు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

వీరంతా 107 బెటాలియన్ కు చెందిన వారని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సుమారు పదీ పన్నెండు మంది స్మగ్లర్లు సరిహద్దులను అక్రమంగా దాటి లోపలికి వస్తుండటాన్ని తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జవాన్లు చూశారని, వారిని వెనక్కు వెళ్లాలని కోరగా, బాంబూ కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేశారని తెలిపారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారని, దీంతో స్మగ్లర్లంతా తిరిగి బంగ్లాదేశ్ వైపు పరిగెత్తారని చెప్పారు.

ఘటనా స్థలిలో ఎనిమిది కిలోల మరిజువానా డ్రగ్ అధికారులకు పట్టుబడిందని, ఇండియాలోకి మాదక ద్రవ్యాలను తీసుకు వచ్చేందుకు స్మగ్లర్లు ప్రయత్నించి విఫలం అయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లకు కూడా గాయాలు అయ్యాయని, వారు కూడా పారిపోవడంతో, వారి ఆరోగ్య పరిస్థితి తెలియదని అన్నారు.