Kanpur Shooting: అచ్చం సినిమాల్లో చూపించినట్టే... ఎంతో తెలివిగా పోలీసులను బలిగొన్న యూపీ నేరస్థులు

  • కాన్పూర్ లో కాల్పుల ఘటన
  • డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసుల మృతి
  • జేసీబీని రోడ్డుకు అడ్డంగా పెట్టి పోలీసుల ప్లాన్ కు కౌంటర్
More dramatic incident happens at Kanpur shooting

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో గతరాత్రి జరిగిన కాల్పుల్లో ఓ డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే, అతని గ్యాంగ్ ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు, చివరికి తామే బలయ్యారు. అయితే, ఈ ఉదంతం యావత్తు ఓ సినిమా యాక్షన్ సీన్ ను తలపిస్తోంది. నేరస్థులు ఫలానా చోట ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందడం ఒకెత్తయితే, పోలీసులు నేరుగా తమ స్థావరానికే వస్తున్నారన్న సమాచారం నేరస్థుడు వికాస్ దూబేకు తెలియడం మరో ఎత్తు.

చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిక్రు గ్రామంలో క్రిమినల్ గ్యాంగ్ ఉందన్న సమాచారంతో పోలీసులు ఆయుధాలతో వచ్చారు. అయితే, పోలీసులు కచ్చితంగా ఓ మార్గంలో వస్తారని గ్రహించిన వికాస్ దూబే ఆ మార్గంలో ఎత్తయిన భవనాలు ఉన్నచోట రోడ్డుకు అడ్డంగా ఎర్త్ మూవర్ (జేసీబీ)ను ఉంచి ఆ మార్గాన్ని బ్లాక్ చేశాడు. జేసీబీ రోడ్డుకు అడ్డంగా ఉండడంతో పోలీసులు తమ వాహనాలను ఆపి కిందకు దిగారు. అప్పటికే ఎత్తయిన భవనాలపైన కాపు కాసిన నేరస్థులు ఒక్కసారిగా కిందికి కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు తప్పించుకునే వీల్లేక బుల్లెట్లకు బలయ్యారు.

ఆ బిల్డింగ్ లపై ఉన్న క్రిమినల్స్ వైపు కాల్పులు జరపడం కింద ఉన్న పోలీసులకు శక్తికి మించిన పనైంది. ఈ లోపే డీఎస్పీ దేవేంద్ర మిశ్రా కూడా నేలకొరగడంతో పోలీసుల ఆత్మస్థైర్యం సన్నగిల్లింది. ఇదే అదనుగా వికాస్ దూబే గ్యాంగ్ అక్కడ్నించి తప్పించుకుంది. ఈ ఘటనలో ఓ స్టేషన్ ఆఫీసర్, ఇద్దరు సబ్ ఇన్ స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఇంతమంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్ దూబే నేరచరిత్ర ఎంతో ఘనం! అతడిపై 52 క్రిమినల్ కేసులున్నాయి. 2001లో క్యాబినెట్ మినిస్టర్ హోదా కలిగిన సంతోష్ శుక్లా అనే ప్రముఖుడ్ని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు.

తాజా కాల్పుల ఘటనతో సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా, డీజీపీ హెచ్ సీ అవస్థి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాన్పూర్ పోలీసు వర్గాలు ఇప్పటికీ ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి వెళితే, కౌంటర్ ప్లాన్ వేసిన వికాస్ దూబే గ్యాంగ్ తమవారినే మట్టుబెట్టడం పోలీసులను నివ్వెరపరిచింది.

More Telugu News