2036 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్.. ప్రజల ఆమోదం!

03-07-2020 Fri 12:04
  • ఇప్పటికే రాజ్యంగ సవరణ
  • రష్యా ప్రజల అభిప్రాయాలను సేకరించిన ఎన్నికల సంఘం
  • 63 శాతం మంది ప్రజలు ఓట్లు
  • అందులో 73 శాతం మంది పుతిన్‌కు సానుకూలంగా ఓట్లు
  • అవకతవకలు జరిగాయని విమర్శలు
Vladimir Putin could rule Russia until 2036

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌  పుతిన్ పదవీ కాలం మరో నాలుగేళ్లు మిగిలిన ఉన్నప్పటికీ ఆయన తన పదవి కాలాన్ని పొడిగించుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుపుతున్నారు. రష్యాకు 2036 వరకు తాను అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు చివరకు ఫలించాయి. 2036 వరకు ఆయనే తమ దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ప్రజలు ఆమోద ముద్ర వేశారు.

ఇందు కోసం రాజ్యంగ సవరణకు వారు అంగీకరించారు. కొన్ని రోజులుగా రాజ్యాంగ సవరణ కోసం రష్యా ప్రజల అభిప్రాయాలను సేకరించే పనిలో ఉన్న ఆ దేశ ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడించింది. సుమారు 63 శాతం మంది ప్రజలు ఓట్లు వేయగా, అందులో 73 శాతం మంది పుతిన్‌కు సానుకూలంగా ఓట్లు వేసినట్లు ప్రకటించింది.

అయితే, ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాగా, రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పదవీ కాలం పొడిగించడానికి జరగాల్సిన రాజ్యాంగ సవరణను రష్యా పార్లమెంట్ గత నెలలోనే ఆమోదించిన విషయం తెలిసిందే.

2024 తరువాత మరో 12 ఏళ్లు కూడా అధ్యక్షుడిగా కొనసాగేలా పుతిన్ సవరణ చేయించుకున్నారు. అంటే, ఇప్పటి నుంచి మరో 16 ఏళ్ల పాటు పుతినే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఆయన 2000 నుంచి రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.