RIL: ఇక ఇంటెల్ వంతు...రిలయన్స్ జియోలో 12వ పెట్టుబడిగా రూ. 1,894.50 కోట్లు!

  • 11 వారాల వ్యవధిలో 12 పెట్టుబడులు
  • 0.39 శాతం వాటా కొన్న ఇంటెల్
  • జియో విశ్వవ్యాప్తమైందన్న రిలయన్స్
Intel Invest in Jio Platforms

రిలయన్స్ జియోపై మరో ఇంటర్నేషనల్ టెక్ దిగ్గజం మనసు పారేసుకుంది. ఏప్రిల్ 22 నుంచి జూన్ 19 వరకు ఫేస్ బుక్, సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్, ముబాదలా, ఎల్ కాటర్ టన్, ఏడీఐఏ, టీపీజీ వంటి సంస్థలు జియో ప్లాట్ ఫామ్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటెల్ సంస్థ కూడా జియోలో ఇన్వెస్ట్ చేసింది. మొత్తం 0.39 శాతం వాటాకు సమానమైన రూ. 1,894.50 కోట్లను జియో ప్లాట్ ఫామ్స్ లో పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో జియోలో మొత్తం రూ. 1,17,588.45 కోట్ల ఇన్వెస్ట్ మెంట్స్ రాగా, 25.09 శాతం వాటాను సంస్థ విక్రయించినట్లయింది.

మొత్తం 11 వారాల వ్యవధిలో జియో ప్లాట్ ఫామ్స్ విశ్వవ్యాప్తమైందని, భారత్ లో ఉన్న వ్యాపార అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పిందని ఈ సందర్భంగా రిలయన్స్ వ్యాఖ్యానించింది. ప్రపంచ విపణిలో ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పెట్టుబడులను స్వీకరించిన ఏకైక సంస్థ రిలయన్స్ కావడం గమనార్హం. అదికూడా కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న వేళ జియోకు భారీ ఎత్తున పెట్టుబడులు రావడం విశేషం.

More Telugu News