China Apps: చైనా యాప్స్ పై బ్యాన్ అంత ఈజీ కాదట!

  • యాప్స్ వాడకుండా చూడటం చాలా కష్టం
  • ట్రాయ్ రంగంలోకి దిగాల్సిందేనంటున్న నిపుణులు
  • మిగతా యాప్స్ సంగతేంటంటున్న పలువురు
Experts Says Baning China Apps Not Easy

కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్ ను వాడకుండా నిషేధం విధించినా, ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమల్లోకి తేవడం, అన్ని స్మార్ట్ ఫోన్ల నుంచి ఈ యాప్స్ ను తీసేయడం అనుకున్నంత సులువు కాదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని డౌన్ లోడ్ చేసుకున్న వారు వాడకుండా చూడటం చాలా కష్టమని అంటున్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లు వీటిని ఇప్పటికే తొలగించగా, యాప్స్ కు సంబంధించిన వెబ్ సైట్లు, ఇతర వెబ్ సైట్ల నుంచి 'ఏపీకే'లను డౌన్ లోడ్ చేసుకుని వాడుకునే వారు వాడుకుంటూనే ఉంటారని నిపుణులు అంటున్నారు.

తమిళనాడులోని మధురై హైకోర్టు టిక్ టాక్ ను గతంలో నిషేధించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అయినా యాప్ ను కస్టమర్లు యథేచ్ఛగా వాడారని వెల్లడించారు. ఇక, ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు), టెలికం సంస్థలు సహకరిస్తే మాత్రం నిషేధాన్ని అమలు చేయవచ్చని, అందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కల్పించుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే నిషేధిత యాప్స్ ను స్మార్ట్ ఫోన్ యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నా పనిచేయవని అంటున్నారు. ఈ యాప్ ను తెరవాలని చూస్తే, నిషేధం గురించిన సమాచారం మాత్రమే కనిపించేలా చూడాల్సి వుంటుందని సూచిస్తున్నారు.

ఇదిలావుండగా, ఈ 59 యాప్స్ తో పాటు, మిగతా చైనా యాప్స్ సంగతేంటని, ఎంతో మందిని బానిసలుగా చేసుకుని ప్రాణాలు తీసిన పబ్ జీ వంటి వాటిని ఎప్పుడు నిషేధిస్తారని పలువురు ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. చైనాకు చెందిన డజనుకు పైగా గేమింగ్ యాప్స్ ప్రమాదకరమని ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. ఇవి, ఫేస్ బుక్, గూగుల్ లాగిన్ తో పనిచేస్తూ, అక్కడి నుంచి సమాచారాన్ని తస్కరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. వీటిపై ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ సంస్థలు కేంద్రానికి తమ రిపోర్టులను అందించగా, దశలవారీగా అన్నింటిపైనా నిషేధాజ్ఞలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

More Telugu News